బరువు తగ్గించే మెడిసిన్స్ తో జాగ్రత్త

బరువు తగ్గించే మెడిసిన్స్ తో జాగ్రత్త

అధిక బరువు తగ్గించుకోవడానికి సరైన ఆహార నియమాలు పాటిస్తూ.. వ్యాయామం చేస్తుంటారు చాలామంది. ఇదే ఆరోగ్యకరమైన మార్గం కూడా. అయితే తీరిక లేని కొంతమంది వీటికి బదులు కొన్ని ఇతర మార్గాల ద్వారా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా మెడిసిన్స్‌ తీసుకుంటారు. వీటితో అనేక దుష్ప్రభావాలు తలెత్తుతాయి. బరువు తగ్గించే మాత్రలు వాడటం ప్రధానంగా జీర్ణాశయ సమస్యలు వస్తాయి. ఈ మాత్రలలో ఉండే ఫ్యాట్ బ్లాకర్స్ అజీర్ణం, గ్యాస్, విరేచనలు కలిగిస్తాయి. వీటిలోని కాంబినేషన్‌‌ల వల్ల శరీరం విటమిన్‌‌లను గ్రహించే శక్తిని కోల్పోతుంది. ఫలితంగా విటమిన్‌‌ల లోపం కూడా కలుగుతుంది.

కాబట్టి బరువు తగ్గించే మాత్రలను వాడే వారు మల్టీ విటమిన్ మాత్రలు కూడా వాడాల్సి వస్తుంది. వీటిలోని సిబుట్రమైన్ అనే సమ్మేళనం ఆకలిని చంపేస్తుంది. అంతేకాకుండా, హృదయ స్పందన రేటును అసాధారణంగా పెంచి, సరైన సమయానికి చికిత్స అందించకపోతే గుండెపోటుకు కారణం కూడా అవుతుంది. మానసిక రుగ్మతలను కూడా కలిగిస్తుంది. హైబీపీ, నిద్రలేమి వంటి దుష్ప్రభావాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా బీపీ పెరగడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం, తలనొప్పి, కడుపు నొప్పి, నోరు పొడిగా మారటం, మలబద్దకం రోగాలు వచ్చే ప్రమాదముంది.