‘కాంత’ చిత్రంలో నటనకు ఆస్కారమున్న పాత్ర పోషించడం, దుల్కర్ సల్మాన్, రానాలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెబుతోంది భాగ్యశ్రీ బోర్సే. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్, రానా నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 14న విడుదలవుతున్న నేపథ్యంలో భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ‘కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి ఓ మంచి పాత్ర లభించడం నా అదృష్టం.
దీన్నొక ఛాలెంజ్‌గా తీసుకుని కుమారి పాత్ర కోసం గ్రౌండ్ వర్క్ చేశా. 1960 నేపథ్యం కావడంతో అప్పటి తెలుగు, తమిళ సినిమాలు చూశా. అలాగే సావిత్రి, శ్రీదేవి గార్ల నటన గమనించా. వాటన్నిటి స్ఫూర్తితో కుమారి పాత్రను రీ క్రియేట్ చేయగలిగా. ఇప్పటివరకు నన్నొక కమర్షియల్ పెర్ఫార్మర్ అన్నారు. ఈ సినిమా తర్వాత ‘భాగ్యశ్రీ ఒక పర్ఫార్మర్ కూడా’ అంటారని ఆశిస్తున్నా. ఈ సినిమా నాకు అలా నటించే అవకాశాన్ని ఇచ్చింది.
టెక్నికల్‌గా నేను ఫస్ట్ సైన్ చేసిన సినిమా ‘కాంత’నే అయినప్పటికీ ఇది ఆలస్యమవడంతో ఈలోపు నా నుంచి రెండు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు కూడా రెండు వారాల గ్యాప్‌తో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వస్తోంది. కొత్త చిత్రాల విషయానికొస్తే.. తెలుగు, హిందీ చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు’’ అని చెప్పింది.
