- విద్యా రంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం మినహాయింపు ఇవ్వాలి
- కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: స్కీం ఫర్ స్పెషల్ అసిస్టెంట్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ (ఎస్‌ఏఎస్‌సీఐ) కింద రాష్ట్రానికి అదనంగా రూ.5 వేల కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. అలాగే విద్యా రంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆమె చాంబర్‌లో కలిశారు. ఈ భేటీలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ డా. గౌరవ్ ఉప్పల్ ఉన్నారు. ఈ సందర్బంగా.. తెలంగాణ అభివృద్ధి, విద్యా రంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలకు అదనపు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర మంత్రిని డిప్యూటీ సీఎం కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ఎస్‌ఏఎస్‌సీఐ పథకం ద్వారా రాష్ట్రాలకు 50 ఏండ్ల వడ్డీలేని రుణాల రూపంలో అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ఇప్పటికే రూ.4,208 కోట్లు మంజూరైన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలకు మరింత ఆర్థిక మద్దతు అవసరమని వివరించారు. 2014–2023 మధ్య ప్రత్యేక ప్రయోజన సంస్థలు (ఎస్ పీవీల) ద్వారా చేపట్టిన అప్పుల భారం, వాటి చెల్లింపుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగిందని పేర్కొన్నారు. అయినప్పటికీ విద్య, వైద్యం, గ్రామీణ మౌలిక వసతులు, మానవ వనరుల అభివృద్ధి రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం భారీ స్థాయిలో పెట్టుబడులు కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
‘బొగ్గు గ్యాసిఫికేషన్’ ప్రాజెక్టుకు సింగరేణి రెడీ
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. తెలంగాణ విద్యుత్ అవసరాలకు అత్యంత కీలకమైన కొయ్యగూడెం బ్లాక్ –3 గతంలో వేలంలో కేటాయించినా నాలుగేండ్లుగా పనులు ప్రారంభం కాలేదని, కాబట్టి దానిని వెంటనే సింగరేణికి అప్పగించేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రిని కోరారు. అలాగే, బొగ్గును కేవలం విద్యుత్ ఉత్పత్తికే కాకుండా, కోల్ ఇండియా తరహాలో ఆధునిక సాంకేతికతతో ‘బొగ్గు గ్యాసిఫికేషన్’ ప్రాజెక్టులుగా మార్చేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని తెలిపారు. దీనివల్ల పారిశ్రామిక ఇంధన భద్రతతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఇందుకు కేంద్రం పాలసీపరమైన, సాంకేతిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తాడిచెర్ల కోల్ బ్లాక్-–2 మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎంఎండీఆర్ చట్టం కింద ముందస్తు పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. తమ విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్టు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమస్యల పరిష్కారానికి త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో హైలెవెల్ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నది.
ప్రపంచ స్థాయి విద్యను అందిస్తం..
‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ ద్వారా రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. విద్యా రంగంలో మార్పులకు మొత్తం రూ.30 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక రూపొందించినట్టు చెప్పారు.ఇందులో రూ.21వేల కోట్లతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్యాంపస్‌ల నిర్మాణం, మరో రూ.9వేల కోట్లతో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, సాంకేతిక విద్యాసంస్థలు, డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధి చేపడుతున్నట్టు వివరించారు. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) సహకారంతో రూ.4,049.11 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్ట్, ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహకారంతో రూ.4,903.44 కోట్ల వ్యయంతో తెలంగాణ ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడేషన్ మిషన్ ప్రాజెక్టులకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (డీఈఏ) ఆమోదం తెలిపినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలను రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు.
