- పాలమూరు ప్రాజెక్టుకు పన్నుపోటు
- రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లో పన్నులే పావు వాటా
- నాలుగు ప్యాకేజీలకు కలిపి రూ.2,353 కోట్లు పెంపు
- అందులో పన్నులే రూ.625 కోట్లు
- అత్యధికంగా ప్యాకేజీ 7లో రూ.908 కోట్లు పెరిగితే.. అందులో పన్నులు ఏకంగా రూ.316 కోట్లు
హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పుడు పన్నులే భారంగా మారుతున్నాయి. ఏండ్లకొద్దీ పనులు సాగదీయడం, చాలా వరకు పెండింగ్‌లో పడిపోవడం, అప్పటికీ ఇప్పటికీ పెట్రోల్, సిమెంట్, ఉక్కు తదితర మెటీరియల్స్ రేట్లు పెరగడం వంటి కారణాలతో అంచనాల పెంపు అనివార్యమైంది. వాటితోపాటే పన్నుల భారమూ అధికమైంది. పెరుగుతున్న అంచనాల్లో ఆ పన్నుల భారమే 26 శాతం దాకా ఉంటున్నది. తాజాగా శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రాజెక్టులోని నాలుగు ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌కు ప్రభుత్వం ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. 7, 11, 15, 17 ప్యాకేజీల పనులకు సంబంధించి అంచనాలను మొత్తంగా రూ.2,353 కోట్లు పెంచారు. అయితే, అందులో రూ.625 కోట్లు పన్నులే కావడం గమనార్హం.
అంటే ఎస్టిమేట్స్‌లో పెంచిన మొత్తంలో ఈ పన్నుల వాటానే 26 శాతంగా ఉంది. అత్యధికంగా ఏడో ప్యాకేజీకే రూ.908 కోట్ల రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఓకే చేయగా.. అందులో రూ.316 కోట్లు పన్నులే ఉన్నాయి. ఇది పెరిగిన అంచనాల్లో 35 శాతం అవుతున్నది. ఆమోదం పొందిన నాలుగు ప్యాకేజీల రివైజ్డ్ ఎస్టిమేట్స్‌లోని పన్నుల్లో.. ఈ ప్యాకేజీలో పెట్టిన పన్నుల మొత్తమే ఎక్కువ కావడం గమనార్హం.
ఈ ప్యాకేజీని మేఘా సంస్థ చేపడుతుండగా.. వ్యాట్ నుంచి జీఎస్టీకి మారడంతోనే పన్నులు ఎక్కువగా పెరిగాయని అధికారులు అంచనాల్లో పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో పనులకు కేవలం రూ.104.93 కోట్ల పెంపునే ప్రతిపాదించారు. అందులో డిజైన్లలో మార్పులు, భౌగోళిక పరిస్థితులు, కొత్త ఇన్‌టేక్ నిర్మాణాల వంటి వాటి వల్ల వ్యయం పెరుగుతున్నదని చెబుతున్నారు. ఇక, ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ పేరిట రూ.497.25 కోట్లను పెంచారు. లేబర్, మెటీరియల్స్‌కు సంబంధించి కాంట్రాక్ట్ ఆబ్లిగేషన్లతో అంచనాలను పెంచుతున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఏదుల రిజర్వాయర్ నుంచి వట్టెం రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు 6.4 కిలోమీటర్ నుంచి 25.4 కిలోమీటర్ పాయింట్ వరకు ట్విన్ టనెల్స్‌ను నిర్మిస్తున్నారు.
17వ ప్యాకేజీలో పన్నుల వాటా 29 శాతం
పాలమూరు ప్రాజెక్టులోని 11వ ప్యాకేజీలో భాగంగా వట్టెం రిజర్వాయర్ బండ్‌ను నిర్మిస్తుండగా.. ఈ ప్యాకేజీకి రూ.682.75 కోట్లు పెంచారు. అందులో పన్నుల వాటా రూ.136 కోట్లుగా.. పెరిగిన అంచనాల్లో 20 శాతంగా ఉంది. వ్యాట్ నుంచి జీఎస్టీకి మారడం, డీఎంఎఫ్, ఎస్ఎంఈటీ, పర్మిట్ ఫీజు వంటి పన్నుల వల్ల భారం పెరిగిందని పేర్కొన్నారు. ఇక ఇందులో వివిధ పనుల నిమిత్తం రూ.180.21 కోట్లు పెంచగా.. ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ కింద రూ.366.56 కోట్లు చూపించారు. ఈ 11వ ప్యాకేజీని హెచ్ఈఎస్, పీసీఐఎల్, ఎన్సీసీ కలిసి చేపడుతున్నాయి. 15వ ప్యాకేజీలో భాగంగా సుశీ ప్రసాద్ జాయింట్ వెంచర్ కరివెన రిజర్వాయర్ నిర్మిస్తున్నది.
ఈ ప్యాకేజీకి రూ.491.85 కోట్లు పెంచారు. అందులో పన్నుల వాటా రూ.97.59 కోట్లు కాగా.. పెరిగిన అంచనాల్లో దీని వాటా 20 శాతం. పనుల కోసం రూ.180.86 కోట్లు పెంచారు. ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ కింద రూ.203.31 కోట్లు పెంచారు. 17వ ప్యాకేజీలో రూ.260.78 కోట్లు పెంచగా.. అందులో పన్నుల వాటా రూ.75.87 కోట్లుగా ఉంది. అంటే పెరిగిన అంచనాల్లో పన్నులదే 29% . డ్రిల్లింగ్, గ్రౌటింగ్, రివెట్మెం, హెడ్ రెగ్యులేటర్, సర్‌ప్లస్ వెయిర్వర్క్స్కు సంబంధించి రూ.29.95 కోట్లు పెంచారు. ఇందులో ప్రైస్ అడ్జస్ట్‌మెంట్ కింద రూ.141.95 కోట్లు చూపించారు. మరో రూ.13 కోట్లు ఇతర అవసరాలను చూపించారు. ఈ ప్యాకేజీలో భాగంగా ఉద్ధండాపూర్ రిజర్వాయర్ నిర్మించనున్నారు. 17వ ప్యాకేజీ పనులను హెచ్ఈఎస్, హర్షా జాయింట్ వెంచర్ చేపడుతున్నది.
