ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఆదాయ మార్గాలపై దృష్టిపెట్టండి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఈ నెల 28 నుంచి అమలులోకి పెరిగిన భూముల విలువలు
  • హిల్ట్ పాలసీ గైడ్‌‌‌‌లైన్స్ సిద్ధం
  • రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి 

హైదరాబాద్, వెలుగు: ఈ ఆర్థిక సంవత్సరం(2026–27) బడ్జెట్​అంచనాలకు అనుగుణంగా ఆదాయం సమకూరే మార్గాలపై అన్ని శాఖల అధికారులు దృష్టిసారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా సవరించిన భూముల మార్కెట్ విలువలు ఈ నెల28 నుంచి అమలులోకి రానున్నాయని తెలిపారు. శుక్రవారం సచివాలయంలో రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మాట్లాడారు.

రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే, పరిశ్రమల శాఖకు సంబంధించిన హిల్ట్ పాలసీ గైడ్‌‌‌‌లైన్స్ సిద్ధమయ్యాయని, త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయంలో ఎలాంటి లీకేజీలు లేకుండా కఠినంగా వ్యవహరించి, ఆదాయ మార్గాల్లోని అవరోధాలను తొలగించాలని సూచించారు. అలాగే, ప్రతి వారం జరిగే రిసోర్స్ మొబిలైజేషన్ కమిటీ సమీక్షకు ప్రాధాన్యతనిస్తూ, అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని చెప్పారు.

అనివార్య కారణాల వల్ల నేరుగా హాజరుకాలేని పక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా పాల్గొనాల్సిందేనని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఆదాయ వనరులు సమకూర్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. పురపాలక, హెచ్ఎండీఏ, మైనింగ్, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రవాణా తదితర కీలక శాఖల ప్రస్తుత ఆదాయ ప్రగతిపై మంత్రులు సమీక్షించారు.

రాబోయే రోజుల్లో సాధించాల్సిన లక్ష్యాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో సీఎస్​రామకృష్ణారావు, ఆర్అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మైన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, రెవెన్యూ సెక్రెటరీ లోకేశ్​కుమార్, టీజీఐఐసీ ఎండీ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.