ఆర్టీసీకి ప్రతి నెల మహాలక్ష్మి నిధులు ఇస్తాం: భట్టి విక్రమార్క

ఆర్టీసీకి ప్రతి నెల మహాలక్ష్మి నిధులు ఇస్తాం: భట్టి విక్రమార్క

కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని విజయవంతంగా అమలవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు రూ. 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని.. ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. 

ఆర్టీసీ సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని భట్టి చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన సంస్థ దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని  ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రజల సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. 

హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో బుధవారం(జనవరి 03) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)పై రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి  సంస్థ ఉన్నతాధికారులు వివరించారు.