భోపాల్–ఇండోర్ వందే భారత్ రైలుకు ప్రయాణికులు కరువు

భోపాల్–ఇండోర్ వందే భారత్ రైలుకు ప్రయాణికులు కరువు

భోపాల్–ఇండోర్ వందే ఎక్స్‌ప్రెస్ మొదటి రోజు 47 మంది ప్రయాణికులతో మాత్రమే నడిచింది. భోపాల్–ఇండోర్ వందే భారత్ రైలును భోపాల్‌లో జూన్ 27వ తేదీ మంగళవారం ప్రధాని మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే మొదటి రోజే ప్రయాణికుల నుండి స్పందన కరువైంది. ఫస్ట్ రన్‌లో 530 సీట్లు ఉన్న రైలులో కేవలం 47 మంది ప్రయాణికులు మాత్రమే ప్రయాణించారు. తక్కువ దూరం, ఛార్జీల విషయంతో సహా అనేక కారణాల వల్ల ఈ మార్గంలో వందే భారత్ రైలు ఫ్లాప్ అవుతుందని ఇప్పటికే జనాలు ఊహించారు. అనుకునట్లే మొదటి రోజే రుజువైంది.

కాగా, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఇండోర్ నుండి భోపాల్‌కు రూ. 810, భోపాల్ నుండి తిరుగు ప్రయాణంలో రూ. 910 ఛారీలు వేస్తున్నారు. దీంతో ప్రయాణికులు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. ఇక మొదటి రోజు 47 మంది ప్రయాణికుల్లో కేవలం 6 మంది మాత్రమే ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించారు. అయితే అధిక ఛార్జీలు అలాగే తక్కువ స్టాప్‌ల కారణంగా ఈ రైలులో ప్రయాణికులను కూర్చోబెట్టడం కొంచెం కష్టమేనని రైల్వేకు సంబంధించిన నిపుణులు భావిస్తున్నారు.

ఇండోర్–భోపాల్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నా.. కేవలం రూ.100తో ప్రయాణించడం వందే భారత్ రైలుపై ప్రభావం పడింది. ఇండోర్ నుండి భోపాల్ వరకు నడుస్తున్న ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 6:35 గంటలకు బయలుదేరుతుంది. ఉజ్జయిని కాకుండా, ఇది మక్సీ, షుజల్‌పూర్, సెహోర్ మరియు ఇతర స్టేషన్లలో కూడా ఆగుతుంది. కానీ వందే భారత్ రైలు ఉజ్జయినిలో మాత్రమే ఆగుతుంది.దీంతో చాలా మంది ప్రయాణికులు సెహోర్‌లో కూడా దిగుతారు. వందే భారత్ రైలు హాల్టింగ్ లను పెంచితే ఈ రైలు మరింత మంది ప్రయాణికులకు చేరువ అవుతుంది. దీంతోపాటు ఛార్జీలను కూడా తగ్గించాల్సి ఉంటుందని నిపునులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఛార్జీల గురించి రైల్వేలోని రత్లాం డివిజన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ రైలులో అనేక అత్యాధునిక సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. దానికి తగ్గట్టుగానే ఛార్జీని నిర్ణయించారని.. రైలులో అల్పాహారంతో పాటు రాత్రి భోజనం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.