అఖిలపక్ష నేతలకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్

అఖిలపక్ష నేతలకు ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్

పది పార్టీల నేతలతో కూడిన అఖిల పక్షాన్ని కలిసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్‌మెంట్ ఓకే అయిందని బీహార్‌‌ సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కులాల వారీగా జనగణన చేయాలన్న డిమాండ్‌ ప్రాధాన్యాన్ని వివరించేందుకు అఖిలపక్షంతో వచ్చి కలుస్తామని గతంలో ప్రధాని మోడీని కోరామని, దీనిపై స్పందించిన ఆయన సోమవారం కలిసేందుకు అంగీకరించారని నితీశ్ చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు అఖిలపక్షంతో వచ్చి కలవొచ్చని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సమాధానం వచ్చిందన్నారు. ‘‘దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీని కలిసే పార్టీల నేతల వివరాలను ఇప్పటికే ఆయన ఆఫీస్‌కు పంపాను. కుల జనగణనపై ప్రధానితో జరిగే సమావేశంలో సానుకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నా” అని ఆయన అన్నారు. కేంద్రం తమ విజ్ఞప్తిని అంగీకరించి, దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కలు తీస్తే వెనుకబడిన వర్గాలకు మరింత మేలు జరుగుతుందని నితీశ్ అన్నారు. సోమవారం జరిగే ఈ సమావేశానికి బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్‌ కుమార్, ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నేత, ఆర్జేడీ లీడర్ తేజస్వీ యాదవ్, బీజేపీ నేత, ఆ రాష్ట్ర మంత్రి జానక్‌ రామ్, రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరుకానున్నారు.