పక్షుల సూసైడ్​ స్పాట్​! అక్కడే ఎందుకు చనిపోతున్నాయి?

పక్షుల సూసైడ్​ స్పాట్​! అక్కడే ఎందుకు చనిపోతున్నాయి?


సూసైడ్‌‌‌‌ స్పాట్స్ అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. సూసైడ్‌‌‌‌ చేసుకోవడానికి అనుకూలంగా ఉండడం వల్ల చాలామంది అక్కడికొచ్చి చనిపోతుంటారు. అందుకే ఆ ప్లేస్‌‌‌‌లని అలా పిలుస్తుంటారు. అలాంటి ప్లేస్‌‌‌‌ అస్సాంలో కూడా ఒకటుంది. కానీ.. ఇక్కడ సూసైడ్ చేసుకునేది మనుషులు కాదు.. పక్షులు. అదేంటి ఎక్కడైనా పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయా? అనే డౌట్‌‌‌‌ రావొచ్చు. కానీ.. చేసుకుంటున్నాయనే చెప్తున్నారు ఇక్కడివాళ్లు. 

దాదాపు వంద సంవత్సరాలకు ముందు నుంచే అక్కడ పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు కొన్ని వేల పక్షులు చనిపోయాయి. ఎందుకు చనిపోతున్నాయి? అక్కడే ఎందుకు చనిపోతున్నాయి? కేవలం కొన్ని రకాల పక్షులే ఎందుకు చనిపోతున్నాయి?... ఇలాంటి ప్రశ్నలకు ఎవరికి తోచిన సమాధానాలు వాళ్లు చెప్తున్నా, ఇప్పటికీ సైంటిఫిక్‌‌‌‌గా నిరూపించిన రీసెర్చ్‌‌‌‌ ఒక్కటి కూడా లేదు. అంటే పక్షుల పాలిట ఇది బర్ముడా ట్రయాంగిల్‌‌‌‌ లాంటిదన్నమాట. ఇంతకీ ఆ ప్లేస్‌‌‌‌ ఎక్కడుందనేగా మీ డౌటు! ఈ సూసైడ్‌‌‌‌ స్పాట్‌‌‌‌ మన దేశంలోనే ఉంది. అస్సాంలోని గువహటి సిటీకి 330 కిలోమీటర్ల దూరంలో, డిమా హసావో జిల్లాలోని జటింగా అనే చిన్న ఊరిలో ఉంది. ఇక్కడ ఇప్పటివరకు ఎంతోమంది సైంటిస్ట్‌‌‌‌లు, ఆర్నిథాలజిస్ట్‌‌‌‌లు రీసెర్చ్‌‌‌‌లు చేశారు. కానీ.. ఈ ప్లేస్‌‌‌‌ గుట్టును పూర్తిగా విప్పి చెప్పినవాళ్లు లేరు. అక్కడికొచ్చే ఆ అందమైన రంగురంగుల పక్షులను చూస్తుంటే మనసు పులకరించిపోతుంటుంది. కానీ.. ఉదయం నిద్రలేవగానే వాటి కళేబరాలను చూస్తే మాత్రం మనసు చివుక్కుమంటుంది. 

రెండు నెలలు మాత్రమే! 

వర్షాకాలం ముగుస్తుందనే టైంలో అంటే.. సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే ఇక్కడ పక్షులు చనిపోతుంటాయి. నల్లని ఆకాశం, చల్లని వాతావరణం ఉన్నప్పుడు.. దాదాపు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10గంటల మధ్యలోనే ఇలా పక్షులు ఆత్మహత్య చేసుకుంటాయి. అది కూడా ఊళ్లోని 1500 మీటర్ల పొడవు, 200 వెడల్పు ఉన్న ఒక చిన్న ప్రదేశంలోనే చనిపోతున్నాయి.  అందుకు కారణాలు మాత్రం ఇప్పటికీ ఎవరూ చెప్పలేకపోయారు. పక్షులు ఎందుకు చనిపోతున్నాయో చెప్పలేకపోవడం ఒక ఎత్తయితే... ఈ టైంలోనే ఎందుకు చనిపోతున్నాయో తేల్చడం మరో ఎత్తయింది ఆర్నిథాలజిస్ట్‌‌‌‌లకు. అయితే.. కొందరు రీసెర్చర్లు మాత్రం దీనికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందంటున్నారు. ఆ పక్షులు ఆత్మహత్య చేసుకోవడం లేదని, సెప్టెంబర్‌‌‌‌ ఆక్టోబర్‌‌‌‌‌‌‌‌ నెలల్లో బలమైన గాలులు వీయడం వల్ల కింద పడి గాయాలై చనిపోతున్నాయని చెబుతున్నారు. అంతేకాదు.. పొగమంచు ఎక్కువగా ఉండడం వల్ల సరిగా కళ్లు కనిపించక చెట్లకు, ఇళ్లకు ఢీకొట్టి చనిపోతున్నాయని మరికొందరు అంటున్నారు. కానీ.. ఇలాంటి వాతావరణ పరిస్థితులు చాలా ఊళ్లలో ఉంటాయి. మరి అక్కడి పక్షులు ఎందుకు చనిపోవడం లేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం  చెప్పలేకపోయారు. 

ఊళ్లో వాళ్లే చంపుతున్నారా? 

జటింగాలో కేవలం 2,500 మందే ఉంటారు. దాదాపు వాళ్లంతా గిరిజనులే. ఆ ఏరియాలో మూఢనమ్మకాలు కూడా కాస్త ఎక్కువగానే ఉంటాయంటున్నారు రీసెర్చర్లు. అందుకే వాళ్లే ఈ పక్షులను చంపుతున్నారేమోనని అనుమానిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడివాళ్లు వాళ్ల ఊరి మీదుగా ఎగురుతూ వెళ్లే పక్షులను ఆత్మలు పంపుతాయని, అవి వాళ్లకు హాని చేస్తాయని నమ్ముతారట. అందుకే టూరిస్ట్‌‌‌‌లు, రీసెర్చర్లు లేని టైం చూసుకుని ఆ పక్షులను చంపుతారని కొందరు వాదిస్తున్నారు. ఒకవేళ ఆ ఊరివాళ్లు వాటిని శత్రువులుగా భావిస్తే, వాటిని తినడానికి ఇష్టపడరు. కానీ.. ఇక్కడ పక్షులు చనిపోయే రెండు నెలల పాటు వాళ్లకు పండుగే. ఆ పక్షులను తీసుకెళ్లి వండుకుని తింటుంటారు. 

వలస పక్షులకు అడ్డా!

జటింగాకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో హఫ్లాంగ్‌‌‌‌ అనే ఒక చిన్న టౌన్ ఉంది. ఇది అస్సాంలో పేరుగాంచిన టూరిస్ట్‌‌‌‌ ప్లేస్‌‌‌‌. ఇక్కడ  హిల్‌‌‌‌ స్టేషన్‌‌‌‌, హఫ్లాంగ్‌‌‌‌ సరస్సు బాగా ఫేమస్‌‌‌‌. జటింగాతోపాటు ఇక్కడికి కూడా ప్రతి సంవత్సరం పక్షులు వలస వస్తుంటాయి. ఈ రెండు ప్రాంతాలు వలస పక్షులకు అడ్డాలు. అయితే.. హఫ్లాంగ్‌‌‌‌ వెళ్లే పక్షులు కూడా జటింగా వస్తుంటాయి. అందుకే ఇక్కడ ఎక్కువ రకాల పక్షులు కనిపిస్తుంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాతావరణం వాటిని ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందని ఇక్కడివాళ్లు నమ్ముతారు. కొందరు ఆర్నిథాలజిస్ట్‌‌‌‌లు మాత్రం ఆ పక్షులు వలస రావడం లేదని, అవి వలస వెళ్లే మార్గంలో జటింగా ఉందని చెబుతున్నారు. సెప్టెంబరు నుంచి నవంబర్ వరకు అస్సాంలో వరదలు వస్తుంటాయి. దాంతో పక్షులు వాటి గూళ్లు, సేఫ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లను కోల్పోతాయి. తప్పని పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. అలా వలస వెళ్లే దారిలోనే జటింగా ఉంది. పక్షులు ఇక్కడికి రాగానే ఒక రకమైన మత్తులోకి వెళ్లిపోతుంటాయి. దాంతో స్తంభాలకు, చెట్లకు తగిలి చనిపోతుంటాయి. కానీ.. ఈ స్టడీకి కూడా సరైన ఆధారాల్లేవు. 

గ్రావిటీ ఎఫెక్ట్‌‌‌‌?

కొందరు సైంటిస్ట్‌‌‌‌లు ఎన్నో రీసెర్చ్‌‌‌‌లు చేసి, ఇక్కడ ఎక్కువ భూగర్భ జలాలు ఉన్నాయి. ఆ నీటికి మ్యాగ్నటిక్‌‌‌‌ క్వాలిటీస్‌‌‌‌ ఉండడం వల్ల పక్షులను కిందకు లాగేస్తున్నాయి అని తేల్చి చెప్పారు. కానీ.. దీనికి సరైన ఆధారాలు చూపించలేకపోయారు. కాబట్టి ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు. ఒకవేళ వీళ్లు చెప్పిందే నిజమైతే అన్ని పక్షుల మీద ఆ ఎఫెక్ట్‌‌‌‌ చూపించాలి!

దేవుడి బహుమతి? 

జటింగాలో దెయ్యాలు ఉన్నాయని, అవి రాత్రి పూట ఆకాశంలో తిరుగుతాయని ఇక్కడివాళ్లు నమ్ముతారు. అవే పక్షులను చంపుతున్నాయని చెబుతున్నారు. అయితే.. పక్షుల్లో కూడా కొన్ని ఆ దెయ్యాల శక్తులను తిప్పికొడుతుంటాయని, అలాంటివే తట్టుకుని బతకగలుగుతున్నాయని అంటున్నారు. ఇదిలా ఉంటే మరికొందరేమో జటింగా ప్రజల కష్టాలు చూడలేక వాళ్ల కోసమే దేవుడు ఈ పక్షులను అక్కడ చంపుతున్నాడని అనుకుంటున్నారు. వాటిని ‘దేవుడి బహుమతి’గా కూడా పిలుస్తారు. అయితే... ఇక్కడ ఉండే మరికొందరేమో ఈ ఊరివాళ్లలో కొందరు క్షుద్రపూజలు చేస్తారని అందుకే ఈ ఏరియాలో పక్షులు చనిపోతుంటాయని నమ్ముతున్నారు. 

వాచ్‌‌‌‌ టవర్ల లైట్లు

ఇక్కడి పక్షులు, సూసైడ్‌‌‌‌ మిస్టరీని తెలుసుకోవడానికి ఇతర దేశాల నుంచి కూడా ఆర్నిథాలజిస్టులు వస్తుంటారు. ఫేమస్‌‌‌‌ ఆర్నిథాలజిస్ట్‌‌‌‌ అన్వరుద్దీన్ చౌధురి రాసిన ‘ది బర్డ్స్ ఆఫ్ అస్సాం’ పుస్తకంలో జటింగా గురించి వివరించారు. ‘‘ఇక్కడ ఎక్కువగా గాలులు వీయడం వల్ల పక్షులు అయోమయంలో పడి జటింగాలో కాంతి(లైట్లు) కనిపించడంతో అటువైపు వెళ్తాయి. అక్కడున్న వెదురు చెట్లకు బలంగా తగిలి కింద పడి, చనిపోతాయి”అని చెప్పారు. కానీ.. ఇది కూడా సైంటిఫిక్‌‌‌‌గా రుజువుకాలేదు. 

జటింగా చాలా ఎత్తయిన ప్రదేశం. కాబట్టి ఈ ఏరియాలో వాచ్‌‌‌‌ టవర్లు పెట్టారు. వాటికి పెద్ద పెద్ద ఫ్లడ్‌‌‌‌ లైట్లు కూడా ఉన్నాయి. పైగా ఎత్తులో ఉండే ఇళ్లలో లైట్లు కూడా మెరుస్తుంటాయి. ఈ లైట్లకు పక్షులు అట్రాక్ట్‌‌‌‌ అవ్వడం వల్ల అటువైపు వెళ్తాయి. వెళ్లే దారిలో చెట్లకు తాకి చనిపోతున్నాయి. ఇదే అదనుగా తీసుకుని మరికొందరు కావాలనే లైట్లు ఏర్పాటు చేసి, పక్షులను వేటాడుతున్నారని ఆర్నిథాలజిస్టులు చెప్తున్నారు. అన్ని ఊళ్లలో లైట్లు ఉంటాయి కదా! అక్కడెందుకు చనిపోవడం లేదన్న ప్రశ్నకు కూడా ఆర్నిథాలజిస్ట్‌‌‌‌లు సమాధానం చెప్పారు. ఈ ఊరి చుట్టూ కొండలు ఉంటాయి. పక్షులు ఎటు చూసినా దారి కనిపించదు. అందుకే ఈ లైట్లను అదే దారి అనుకుని అటువైపు వస్తుంటాయట. 

కానీ.. ఇది కూడా సైంటిఫిక్‌‌‌‌గా రుజువు కాలేదు. కేవలం అంచనా మాత్రమే. ఈ మిస్టరీ గురించి ఎవరెన్ని రకాలుగా చెప్పినా ఆర్నిథాలజిస్ట్‌‌‌‌లు చెప్పిందే ఎక్కువమంది నమ్ముతున్నారు. అయితే, విదేశాలు, దూర ప్రాంతాల నుంచి వస్తున్న పక్షులు మాత్రం ఈ లైట్లకు ప్రభావితం అవ్వడంలేదు.

44 రకాలు మాత్రమే 

మరో విశేషం ఏంటంటే..  ఇక్కడికి ఎన్నో రకాల పక్షులు వస్తున్నా.. అందులో 44 రకాల పక్షులు మాత్రమే చనిపోతుంటాయి. మిగిలినవి సేఫ్‌‌‌‌గా తమ డెస్టినేషన్స్‌‌‌‌కు చేరుకుంటాయి. అంతేకాదు.. ఇక్కడికి వచ్చే పక్షుల్లో విదేశీ పక్షులు, స్వదేశీ పక్షులు ఉంటాయి. వాటిలో విదేశీ పక్షుల మీద ఎటువంటి ఎఫెక్ట్‌‌‌‌ ఉండదు. దేశీయ పక్షులు మాత్రమే ఇక్కడి మ్యాజిక్‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌కి గురవుతాయి. టైగర్‌‌‌‌‌‌‌‌ బెటర్న్‌‌‌‌‌‌‌‌, లిటిల్‌‌‌‌ ఎగ్రెట్‌‌‌‌, బ్లాక్ బెటర్న్‌‌‌‌, పాండ్‌‌‌‌ హెరాన్, కింగ్ ఫిషర్‌‌‌‌‌‌‌‌లాంటి పక్షులు ఎక్కువగా చనిపోతుంటాయి. వీటితోపాటు బ్లాక్ డ్రోన్, హిల్ పార్ట్రిడ్జ్, గ్రీన్ పిజియన్‌‌‌‌, నెక్లెస్డ్ లాఫింగ్ థ్రష్ వంటి పక్షుల జాతుల పక్షులు ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటాయి.  

కరుణాకర్​ మానెగాళ్ల