బిస్కెట్లు, చాక్లెట్లు, క్రీమ్​లు, సబ్బుల ఫ్యాక్టరీలు కొన్నే నడుస్తున్నయ్

బిస్కెట్లు, చాక్లెట్లు, క్రీమ్​లు, సబ్బుల ఫ్యాక్టరీలు కొన్నే నడుస్తున్నయ్

ముంబై : టాప్ కన్జూమర్ ప్రొడక్ట్ కంపెనీల మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్స్ అన్నీ దాదాపు కరోనా హాట్‌స్పాట్లలోనే ఉండటంతో వీటికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ కొరత ఏర్పడుతోంది. ఐటీసీ, బ్రిటానియా, నెస్లే, కోల్‌గేట్, డాబర్, బజాజ్ కన్జూమర్లకు చెందిన మొత్తం 157 ప్లాంట్లలో 68 ప్లాంట్లు లేదా 43 శాతం కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఉన్నాయి. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత ప్రొడక్షన్‌ చేపట్టేందుకు వీలవుతుందని కంపెనీలు పేర్కొంటున్నాయి. కరోనా రెడ్‌జోన్లలో ఉన్న ప్లాంట్లు ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌లలో  ఉన్నాయి. ఈ కరోనా ప్రభావిత ప్రాంతాల్లో ప్రొడక్ట్ ల మూవ్‌మెంట్‌కు, ముడిసరుకుల సప్లయికు అంతరాయం ఏర్పడుతోందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. కరోనా హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ఉన్న కంపెనీలు సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాలని, స్క్రీనింగ్ చర్యలు తీసుకోవాలని, సోషల్ డిస్టెన్సింగ్‌ విధానాలు పాటించాలని ఆదేశించినట్టు డాబర్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షారుఖ్ ఖాన్ చెప్పారు. కొన్ని ఫ్యాక్టరీలను బలవంతంగా మూసివేశామని తెలిపారు. దీంతో సప్లయి చెయిన్‌పై ప్రభావం పడుతోంది. ఎఫ్‌ఎంసీజీలకు చెందిన 157 ఫ్యాక్టరీలు రెడ్‌జోన్లలో ఉన్నాయి.

ఎంప్లాయిస్‌పై కూడా పోలీసులు ఆంక్షలు

టాప్ 12 సిటీల్లో ఉన్న 76 శాతం కుటీర, చిన్న పరిశ్రమలన్ని పూర్తిగా మూతపడ్డాయి. వాటిలో 60 శాతం పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వచ్చే రెండు వారాల్లో వాటి ఆర్థిక పటిష్టతను బట్టి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుందని గ్లోబల్‌ రీసెర్చ్ సంస్థ ఒక రిపోర్ట్ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో ఫ్యాక్టరీలను మూసివేయడంతో అత్యవసర, ప్యాకేజ్డ్ గూడ్స్ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రొడక్షన్‌కు కోత పెట్టాయి. వీటికి రా మెటీరియల్ కొరత ఉంది. కొన్ని కంపెనీల ఫ్యాక్టరీల్లో వర్కర్లపై కంట్రోల్స్‌ కూడా పెట్టారు. అయినప్పటికీ  కరోనా వ్యాప్తి భయంతో చాలా మంది వర్క్ కి రావడానికి భయపడుతున్నారు.   యూనిట్లను మళ్లీ ప్రారంభించడం ఎఫ్‌ఎంసీజీలకు సవాలేనని యాంటిక్యూ స్టాక్ బ్రోకింగ్ అనలిస్ట్ అభిజిత్ కుండు చెప్పారు.   బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రస్తుతం 75 శాతం ప్రొడక్షన్ కెపాసిటీతో రన్ అవుతోందని ఈ కంపెనీ ఎండీ వరుణ్ బెర్రీ అన్నారు. కానీ లాక్‌డౌన్ దీని డిస్ట్రిబ్యూషన్‌ను ప్రభావితం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.  లేబర్ కొరత, ట్రక్కు డ్రైవర్లు దొరకకపోవడం అతిపెద్ద సమస్యలని పేర్కొన్నారు. ఆపరేషన్స్‌ ను ఆపివేయడం, ప్రొడక్షన్ తగ్గించడం లేదా పెంచడం అదంతా అధికారుల ఆదేశాలకు అనుగుణంగా చేపడుతున్నామని నెస్లే తెలిపింది.