హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పరస్పర రక్షణ రాజకీయాలు నడుస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆరోపించారు. గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్‌ను కేసీఆర్ కాపాడితే.. ఇప్పుడు కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌ను రేవంత్ కాపాడుతున్నారని పేర్కొన్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో భారీ అవినీతి జరిగినా రేవంత్సర్కారు ఇప్పటివరకు విచారణ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లో బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన లక్షల కోట్ల అప్పులు, మోటార్లకు మీటర్ల అంశంపై కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని.. దీనిపై తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు ఈ రెండు పార్టీల నాటకాలను గమనిస్తున్నారని, మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమని నమ్ముతున్నారని అభిప్రాయపడ్డారు. జగిత్యాలలో బీఆర్ఎస్, భూపాలపల్లిలో కాంగ్రెస్ సభల తీరు చూస్తుంటే.. బీజేపీ పెరుగుదలను చూసి ఆ రెండు పార్టీలు బెంబేలెత్తుతున్నాయనే విషయం అర్థమవుతోందన్నారు.
23న ‘జన్ ఆక్రోష్ పాదయాత్ర’
మహిళా రిజర్వేషన్లను అటకెక్కించిన కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళా వ్యతిరేక వైఖరిని ఎండగట్టేందుకు గురువారం(23న) హైదరాబాద్‌లో జన్ ఆక్రోష్ పాదయాత్ర నిర్వహించనున్నట్లు రాంచందర్ రావు తెలిపారు. ఈ యాత్ర జీహెచ్‌ఎంసీ ఆఫీస్ నుంచి ప్రారంభమై దోమల్‌గూడ మీదుగా ఇందిరా పార్క్ వరకు కొనసాగుతుందని చెప్పారు.

