టెక్ ప్రపంచంలో ఒక శకం ముగియనుంది. ఆపిల్ కంపెనీకి సుమారు 15 ఏళ్లుగా అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన టిమ్ కుక్, 2026 సెప్టెంబర్ 1న సీఈఓ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
తన రిటైర్మెంట్ గురించి చెబుతూ.. "నన్ను నమ్మినందుకు, మీరు చూపించిన అపారమైన ప్రేమకు ధన్యవాదాలు. నా స్థానంలోకి వస్తున్న జాన్‌కు స్వాగతం. ఆయన గురించి మీరు తెలుసుకోవాలని నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని టిమ్ కుక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
సుందర్ పిచాయ్ ప్రశంసలు
ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, టిమ్ కుక్‌ను ప్రశంసించారు. "టిమ్ కుక్ గారు.. మీ ప్రస్థానం అద్భుతం. ఆపిల్ కంపెనీ పట్ల మీకున్న అంకితభావం నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. మీ కొత్త జీవితానికి శుభాకాంక్షలు. అలాగే కొత్త సీఈఓ జాన్ టెర్నస్‌తో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను" అని పిచాయ్ పేర్కొన్నారు.
ALSO READ : భారతదేశం భగభగ మండుతోంది
ఎవరీ జాన్ టెర్నస్
ఆపిల్ కొత్త సీఈఓగా ఎంపికైన జాన్ టెర్నస్ (51) ఆ కంపెనీలోనే 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయన 2001లో ఒక ఇంజనీర్‌గా ఆపిల్‌లో చేరారు. ఐప్యాడ్, ఎయిర్‌పాడ్స్, ఐఫోన్ వంటి విప్లవాత్మక ఉత్పత్తుల తయారీలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2021 నుండి హార్డ్‌వేర్ ఇంజనీరింగ్ విభాగంలో కీలక బాధ్యతలు చేపట్టారు.
టిమ్ కుక్ సాధించిన ఘనతలు:
టిమ్ కుక్ హయాంలో ఆపిల్ కంపెనీ ఊహించని రీతిలో ఎదిగింది:
*ఆపిల్ విలువ 350 బిలియన్ డాలర్ల నుండి 4 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు 1000% పైగా) పెరిగింది.
*కంపెనీ వార్షిక ఆదాయం దాదాపు 4 రెట్లు పెరిగి, 416 బిలియన్ డాలర్లకు చేరింది.
*ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా ఆపిల్ స్టోర్లు ఏర్పాటయ్యాయి.
*ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 250 కోట్ల ఆపిల్ ఐఫోన్లు, మ్యాక్‌లు మొదలైనవి వాడుకలో ఉన్నాయి.

