V6 News

దేశంలో డైట్ కోక్ సంక్షోభం: గ్యాస్ కష్టాల కంటే జెన్ Z కుర్రోళ్లను వేధిస్తుంది ఇదే..!

దేశంలో డైట్ కోక్ సంక్షోభం: గ్యాస్ కష్టాల కంటే జెన్ Z కుర్రోళ్లను వేధిస్తుంది ఇదే..!

దేశంలో ఇప్పుడు గ్యాస్ సంక్షోభానికి మించి.. ఇంధన సమస్యకు మించి అతి పెద్ద సంక్షోభం ఉంది.. అదేంటో తెలుసా.. డైట్ కోక్ సంక్షోభం.. అవును మార్కెట్ లో డైట్ కోక్ దొరకటం లేదంట.. దేశంలోని సమస్యల కంటే.. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కంటే.. ఇప్పుడు జనరేషన్ జెడ్ కుర్రోళ్లు.. ఈ డైట్ కోక్ దొరకటం లేదని ఎక్కువ బాధపడుతున్నారంట.. అవును.. ఇది నిజం.. దేశంలో డైట్ కోక్ దొరకటం లేదంటూ జెన్ జెడ్ కుర్రోళ్లు అంటూ సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ సిలిండర్ ఫొటోలను.. డైట్ కోక్ తో పోల్చుతూ.. మీమ్స్ చేస్తూ హడావిడి చేస్తున్నారు. ఇంతకీ ఇండియాలో డైట్ కోక్ సంక్షోభం ఎందుకు వచ్చింది.. కారణాలు ఏంటీ.. సోషల్ మీడియాలో యూత్ హంగామా ఏంటో తెలుసుకుందామా..

డైట్ కోక్.. ఇది జెన్-జెడ్ కుర్రాళ్లకు ఒక ఎమోషన్. గత కొన్ని రోజులుగా దేశంలోని మెట్రో నగరాల్లో డైట్ కోక్ క్యాన్లు మాయమైపోతుండటంతో సోషల్ మీడియాలో కోక్ కరువు మొదలైంది. ఇన్ స్టాగ్రామ్ రీల్స్ నుంచి ఎక్స్ పోస్టుల వరకు ఎక్కడ చూసినా డైట్ కోక్ కోసం వెతుకులాటలే కనిపిస్తున్నాయి. ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్ లాంటి నగరాల్లో క్విక్ కామర్స్ యాప్స్ ఓపెన్ చేస్తే అవుట్ ఆఫ్ స్టాక్ అని కనిపించటం కుర్రోళ్లకు పిచ్చెక్కిస్తోంది. దీంతో వారు తమకు కోక్ కావాలంటూ వినూత్నంగా సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. 

డైట్ కోక్ కొరతపై జెన్-జెడ్ గ్యాంగ్ స్పందిస్తున్న తీరు వినూత్నంగా, క్రేజీగా ఉంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత కంటే డైట్ కోక్ కొరత నన్ను ఎక్కువ బాధ పెడుతోంది అంటూ ఒక యూజర్ చేసిన కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకొందరైతే "డైట్ కోక్ ఇస్ ది న్యూ ఎల్పీజీ" అంటూ మీమ్స్ వర్షం కురిపిస్తున్నారు. అసలు డైట్ కోక్ దొరకకపోవడానికి గల కారణాల కంటే.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఫన్నీగా ఉంది. 

అయితే అసలు మేటర్ ఏంటంటే.. ఇది కేవలం మీమ్స్ కి పరిమితం కాలేదు. గ్లోబల్ సప్లై చైన్ సమస్యలు, ముఖ్యంగా అల్యూమినియం క్యాన్ల కొరత కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముడి పదార్థాల షార్టేజీలు, రవాణా ఆలస్యం వంటి కారణాల వల్ల కంపెనీలు సకాలంలో స్టాక్ పంపలేకపోతున్నాయని తేలింది. ఢిల్లీ లాంటి కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్టాక్ ఉన్నప్పటికీ.. మిగిలిన ప్రధాన నగరాల్లో మాత్రం డైట్ కోక్ కోసం కిరాణా స్టోర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది జెన్ జెడ్ కుర్రోళ్లకు.

సప్లై ఆగిపోయినప్పుడే ఆ వస్తువుకు ఎంత అడిక్ట్ అయ్యామో తెలుస్తుందంటూ ఒక నెటిజన్ ఈ పరిస్థితిపై అభిప్రాయం వ్యక్తం చేసారు. చాలా మంది తమ బ్లింకిట్, జెప్టో లాంటి క్విక్ కామర్స్ యాప్స్‌లో నోటిఫికేషన్లు పెట్టుకుని మరీ డైట్ కోక్ కోసం వెయిట్ చేస్తున్నారు. సిలిండర్ ఆకారంలో ఉన్నవన్నీ ఇప్పుడు హాట్ కేకుల్లా మారిపోయాయని, డైట్ కోక్ దొరకడం ఒక లగ్జరీగా మారిందని ఫీలవుతున్నారు. ఈ క్రేజీ షార్టేజ్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు కానీ.. అప్పటివరకు సోషల్ మీడియాలో ఈ మీమ్స్ హంగామా మాత్రం ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు.