రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో సినిమా లెవల్ ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. పెళ్లిలో డీజే వాయించడానికి వచ్చిన యువకుడితో ఓ యువతి ప్రేమలో పడింది. ఇంట్లో వారు బలవంతంగా చేసిన బాల్య వివాహాన్ని కాదని, తన మనసు మెచ్చిన వాడినే పెళ్లి చేసుకుంది.
సమాచారం ప్రకారం... సుమారు ఏడాది క్రితం అంజు చౌదరి నివసించే గ్రామంలో ఓ పెళ్లి జరిగింది. ఆ పెళ్లిలో మ్యూజిక్ వాయించడానికి జీత్ రామ్ చౌదరి అనే యువకుడు డీజేగా వచ్చాడు. అక్కడ మొదలైన వీరి పరిచయం, ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకుని మాట్లాడుకునే వరకు వెళ్లింది. అది కాస్తా చివరికి ప్రేమగా మారింది.
బాల్య వివాహాన్ని కాదని..
అంజు చౌదరి చిన్నతనంలో ఉన్నప్పుడే ఆమె కుటుంబికులు మరో యువకుడితో బాల్య వివాహం చేశారు. అయితే ఆమె ఎప్పుడూ అత్తగారి ఇంటికి వెళ్లలేదు. ఇప్పుడు ఆమె మేజర్ కావడంతో, తనపై ఉన్న బాల్య వివాహ సంకెళ్లను తెంచుకోవాలని నిర్ణయించుకుంది. తనకు ఇష్టం లేని పెళ్లిని తిరస్కరించి, ప్రియుడు జీత్ రామ్ చౌదరితో కలిసి జీవించాలని నిర్ణయించుకుంది.
ఆర్య సమాజ్‌లో పెళ్లి
వీరిద్దరూ ఏప్రిల్ 20న ఆర్య సమాజ్‌లో హిందూ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు. అయితే వారి కుటుంబాల నుంచి ప్రాణహాని ఉందని భయపడి, రక్షణ కోసం అజ్మీర్ ఎస్పీని ఆశ్రయించారు. తాను ఇష్టపూర్వకంగానే ఈ పెళ్లి చేసుకున్నానని, తనకేమైనా జరిగితే తన కుటుంబమే బాధ్యత వహించాలని అంజు పోలీసులకు తెలిపింది.
ALSO READ : గాల్లోనే గుండె పోటు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
ఈ కేసు ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక ప్రేమ వివాహానికి చక్కటి ఉదాహరణ అయిన, బాల్య వివాహమనే దురాచారాన్ని వ్యతిరేకించాలన్న ఆ యువతి నిర్ణయం కూడా కీలకంగా పరిగణించబడుతోంది.

