ఖజానా నింపుకొనేందుకే భూముల విలువ పెంచిన్రా? : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు

ఖజానా నింపుకొనేందుకే భూముల విలువ పెంచిన్రా? : బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు
  • ముందస్తు ప్రణాళిక, శాస్త్రీయత లేకుండా ఎలా పెంచుతారు: బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్ రాంచందర్​ రావు
  • చార్జీలు తగ్గించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తామని హెచ్చరిక 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను ఒక్కసారిగా పెంచడం వల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారీ భారం పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, శాస్త్రీయ అధ్యయనం చేయకుండా భూముల ధరలు పెంచడం సరైంది కాదన్నారు. రైతులకు లాభం రావడాన్ని స్వాగతిస్తామని, కానీ రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వ ఖజానా నింపుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు.

ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం ఇబ్బందుల్లో ఉండగా, ఈ నిర్ణయంతో మరింత సంక్షోభం ఏర్పడుతుందన్నారు. కొన్ని చోట్ల భూముల విలువలను 50 శాతం నుంచి 300 శాతం వరకు పెంచడంతో సామాన్యులకు రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో అదనపు భారం పడుతోందని చెప్పారు. గ్రామాల్లో ఎకరం కనీస ధర రూ.2.75 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.5 లక్షలు, హెచ్ఎండీఏ పరిధిలో రూ.10 లక్షలుగా నిర్ణయించడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

పాత ధరల ప్రకారం చలాన్లు కట్టిన వారికీ కొత్త ధరలే వర్తింపజేయడం అన్యాయమన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా చార్జీలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని విమర్శించారు. కరెంట్ బిల్లులు, ఆర్టీసీ చార్జీలు, ఆస్తి పన్ను, తాగునీటి చార్జీల తర్వాత ఇప్పుడు ఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్ పేరుతో మరో భారం వేసిందని ఆరోపించారు. పెంచిన భూముల విలువలను వెంటనే సమీక్షించాలని, విద్యుత్, ఆర్టీసీ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజల తరఫున రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు.