అచ్చంపేట/ఆమనగల్లు, వెలుగు: ‘సర్’ పేరుతో ఓట్లను తొలగించి పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన బీఎల్ ఏలు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తే మంచిదే.. కానీ బీజేపీకి అనుకూలంగా లేని ఓటర్లను తొలగిస్తూ అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్లడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదన్నారు.
సర్ కార్యక్రమాన్ని జరిగే సమయంలో బీఎల్ఈఏలు అప్రమత్తంగా ఉండి నిజమైన ఓట్లను తొలగించకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమ పథకాల కోసం నిధులు లేవని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. గెస్ట్ హౌస్‌కు రూ.100 కోట్లు, కంచె నిర్మాణానికి రూ.17 కోట్లు, ఇతర ఖర్చులకు వందల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారం మోపుతోందని, రైతు భరోసా నిధులు, బోనస్ బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదన్నారు.
నల్లమల పేరును సీఎం ఉపయోగించుకుంటూ ఈ ప్రాంత గౌరవాన్ని దెబ్బతీస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాలు గెలిచి, కొడంగల్‌లో రేవంత్‌రెడ్డిని ఓడిస్తామన్నారు. రాష్ట్రంలో 100కుపైగా స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల పనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా కడ్కాల్ లోని ఎరువుల దుకాణం వద్ద రైతులతో మాట్లాడి, ఎరువుల పంపణీని పరిశీలించారు. ఆయన వెంట మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నాయకులు శ్రీకాంత్ భీమా, మనోహర్, నరసింహ గౌడ్, ఎడ్మ సత్యం ఉన్నారు.
