యువత పిడికిలెత్తితే ప్రగతి భవన్ గోడలు బద్దలైతయ్ 

యువత పిడికిలెత్తితే ప్రగతి భవన్ గోడలు బద్దలైతయ్ 
  • జాబ్ నోటిఫికేషన్ల కోసం 27న ధర్నా చౌక్ లో దీక్ష: సంజయ్ 
  • నిరుద్యోగులు భారీగా తరలిరావాలంటూ పిలుపు 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ కోసం వెంటనే నోటిఫికేషన్లు రిలీజ్ చేయాలన్న డిమాండ్ తో ఈ నెల 27న బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ లో దీక్ష చేపట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ తీరుకు నిరసనగా తాను చేపట్టనున్న ఈ ఒక్కరోజు దీక్షకు నిరుద్యోగులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. నోటిఫికేషన్లు ఇచ్చేదాకా సీఎంను వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. యువత పిడికిలెత్తితే ప్రగతి భవన్ గోడలు ఎట్ల బద్దలైతయో ఆరోజు చూపిస్తామన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో సంజయ్ మాట్లాడారు. ‘‘కేసీఆర్ వేసిన బిస్వాల్ కమిటీయే రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని తేల్చింది. వివిధ కార్పొరేషన్లలో మరో లక్ష ఖాళీలు ఉంటాయి. వీటన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఏడేండ్లుగా నిరుద్యోగులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా, ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వేయలేదన్నారు. కేసీఆర్ తీరుతో డిగ్రీలు, పీజీలు చదివిన తర్వాత కూడా పేరెంట్స్ కు భారమవుతున్నామన్న బాధతో నిరుద్యోగులు సెల్ఫీ వీడియోలు పెట్టి సూసైడ్ చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నీ తుగ్లక్ పాలన, అనాలోచిత నిర్ణయాల వల్ల ఉద్యోగులు, టీచర్లు బజారున పడ్డరు. లక్షలాది నిరుద్యోగులు ఆగమైతున్నరు. జనాలను పక్కదారి పట్టించేందుకే కొత్త సమస్యలు సృష్టిస్తూ.. ఇష్టమొచ్చినట్లుగా జీవోలిస్తున్నవ్” అని సీఎంపై సంజయ్ ఫైర్ అయ్యారు. 317 జీవోతో ఉద్యోగులు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలో ఇంకా ఎంత మంది స్టూడెంట్లు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ స్పందిస్తారని రంగారెడ్డి జిల్లా కోహెడలో నిర్వహించిన శిక్షణ శిబిరంలో సంజయ్​ మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు, స్టూడెంట్ల ఆత్మహత్యల పాపం కల్వకుంట్ల తండ్రీకొడుకులదే అంటూ ఫైర్ అయ్యారు.

ఫ్రస్ట్రేషన్​లో కేసీఆర్: రఘునందన్ రావు

కేసీఆర్ అధికార దాహంతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. శిక్షణ శిబిరంలో ఆయన మాట్లాడారు. ప్రజలు నమ్మడం లేదన్న భయంతోనే వారి దృష్టి మళ్లించేందుకు అహంకారపు మాటలు మాట్లాడుతున్నాడని విమర్శించారు. కాగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఈ నెల 21న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు.

లిక్కర్ ఆమ్దానీ ప్రోగ్రెస్సా​: ఈటల

తాగుడు మీద వచ్చే ఆదాయం ప్రోగ్రెసివ్ గ్రోత్ కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ శిక్షణా శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలతో రూ. 30 వేల కోట్ల ఆదాయం వస్తోందని, గల్లీగల్లీలో బెల్ట్ షాపులు పెట్టి మరీ తాగించి సంపాదిస్తున్నారని విమర్శించారు. మద్యానికి బానిసలై భర్తలు చనిపోయిన ఆడబిడ్డల ఉసురు సీఎం కేసీఆర్ కు తప్పక తగుల్తుందన్నారు.ఒక్క గింజ కూడా మిగలకుండా కొంటున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కేసీఆర్ చెప్పిండని, కానీ రాష్ట్ర మంత్రి మేము మధ్యవర్తులం (బ్రోకర్లం) మాత్రమేనని ఇయ్యాల చెప్తున్నారని ఈటల రాజేందర్​ విమర్శించారు.