కాంగ్రెస్ అసంతృప్తులపై కమలం ఫోకస్​

కాంగ్రెస్ అసంతృప్తులపై కమలం ఫోకస్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​లోని అసంతృప్త నేతలను చేర్చుకోవడంపై బీజేపీ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ టార్గెట్​గా ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలుపెట్టింది. రాష్ట్రంలో బీఆర్ఎస్​కు బీజేపీనే ప్రత్యామ్నాయమనే నమ్మకం ఏర్పడడంతో కాంగ్రెస్ లోని అసంతృప్తులు కూడా బీజేపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇదే మంచి అవకాశమని భావిస్తున్న బీజేపీ నేతలు.. కాంగ్రెస్ సీనియర్లతో మంతనాలు జరుపుతూ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లకు రాజకీయంగా భరోసానిస్తూ తమవైపు తిప్పుకుంటున్నారు. మరో ఏడెనిమిది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో 119 నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులే లక్ష్యంగా బీజేపీ ముందుకెళ్తోంది. 

మాజీ కాంగ్రెస్ నేతలతో వ్యూహం 

గతంలో కాంగ్రెస్​లో కీలకంగా పనిచేసి బీజేపీలో చేరిన కొందరు నేతలు.. ప్రస్తుతం కాంగ్రెస్​లోని అసంతృప్తులను బీజేపీలో చేర్చుకునే పనిలో ఉన్నా రు. తాజాగా నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్​కు గుడ్ బై చెప్పి.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం వెనుక కమల దళం ఇదే రకమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఏలేటి చేరికలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి డీకే అరుణ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు ఏలేటి బాటలోనే మరికొందరు కాంగ్రెస్ అసంతృప్తులు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 

కాంగ్రెస్​లో ఆందోళన 

గత మూడేండ్ల రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే చాలామంది కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలో చేరారు. డీకే అరుణ నుంచి మొదలు పొంగు లేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, కూన శ్రీశైలం గౌడ్, శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ కొడుకు రవి కుమార్ యాదవ్, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బీజేపీలో చేరారు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో బీజేపీ తరఫున పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. అది బీజేపీకి మరింత సానుకూలంగా మారింది. రానున్న రోజుల్లో మరికొందరు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే అవకాశం ఉంది. దీంతో నేతలను ఎలా ఆపా లని కాంగ్రెస్​లో ఆందోళన కనిపిస్తోంది.