- ఇయ్యాల రాత్రి 8 గంటలకు మిసైల్స్ ప్రయోగిస్తం..
టెహ్రాన్: ఇరాన్ ప్రభుత్వం అంతర్జాతీయ టెక్ సంస్థలపై సంచలన హెచ్చరికలు జారీ చేసింది. తమ దేశంలో అమెరికా, ఇజ్రాయెల్ జరుపుతున్న ‘‘ఉగ్రవాద చర్యలకు’’ సహకరిస్తున్నాయన్న ఆరోపణలతో.. గూగుల్, యాపిల్, మెటా, టెస్లా, మైక్రోసాఫ్ట్ సహా 18 అమెరికన్ టెక్ కంపెనీలపై ఏప్రిల్ 1న దాడులు చేస్తామని ఇరాన్ స్టేట్ మీడియా వెల్లడించింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడులు బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభిస్తామని ప్రకటించింది.
కిలోమీటరు పరిధి దాటి వెళ్ళిపోవాలని హెచ్చరిక
ఈ కంపెనీలను ‘‘అమెరికా యుద్ధోన్మాద ప్రభుత్వంతో చేతులు కలిపిన గూఢచారి సంస్థలు’’గా ఐఆర్ జీసీ అభివర్ణించింది. ఇరాన్ లోపల కీలక వ్యక్తుల హత్యలకు, టార్గెట్లను గుర్తించడానికి ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సేవలను అమెరికా, ఇజ్రాయెల్‌లకు అందించాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల ఉద్యోగులు, వాటి ఆఫీసులకు చుట్టుపక్కల కిలోమీటరు పరిధిలో నివసించే ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని హెచ్చరించింది.
రాజకీయ హత్యలకు ప్రతికార చర్యలు
తమ రాజకీయ నాయకులు, సైనిక అధికారులపై జరుగుతున్న టార్గెటెడ్ దాడులను ఆపాలని తాము చేసిన హెచ్చరికలను అమెరికా, ఇజ్రాయెల్ బేఖాతరు చేశాయని ఇరాన్ మండిపడింది. మంగళవారం మళ్లీ కొత్త దాడులు జరగడంతో, ఇకపై ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వాములయ్యే ప్రధాన సంస్థలన్నింటినీ "చట్టబద్ధమైన లక్ష్యాలు" గా పరిగణిస్తామని ఐఆర్ జీసీ స్పష్టం చేసింది.
