జపాన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది టెక్నాలజీ. కానీ ప్రస్తుతం ఆ దేశం ఒక విచిత్రమైన, ప్రమాదకరమైన జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ బర్త్ రేటు దారుణంగా పడిపోతోంది. యువత పెళ్లిళ్లపై అస్సలు ఇన్ట్రెస్ట్ చూపడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తున్న ఒక వినూత్నమైన, వివాదాస్పదమైన ప్రతిపాదన ‘సింగిల్స్ టాక్స్’. ఒంటరిగా ఉండేవారిపై అదనపు భారం వేసి.. ఆ డబ్బుతో పిల్లలు ఉన్న కుటుంబాలను ఆదుకోవాలన్నదే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం.
అసలు సింగిల్స్ టాక్స్ ఏమిటి?
నిజానికి జపాన్ ప్రభుత్వం దీనిని అధికారికంగా పన్ను అని పిలవడం లేదు. దీని అసలు పేరు "చైల్డ్ అండ్ చైల్డ్-రియరింగ్ సపోర్ట్ కాంట్రిబ్యూషన్". అయితే సోషల్ మీడియాలో ఇది సింగిల్స్ టాక్స్ గా ప్రచారంలోకి వచ్చింది. ఇది నేరుగా విధించే పన్ను కాదు. కానీ ప్రతి ఉద్యోగి చెల్లించే పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో అదనపు మొత్తంగా దీనిని వసూలు చేస్తారు. మొదట్లో ఇది నెలకు సగటున 250 యెన్ల అంటే సుమారు రూ.145 నుంచి ప్రారంభమైంది. భవిష్యత్తులో ఇది పెరిగే అవకాశం ఉంది. పిల్లలు ఉన్నవారు, లేనివారు అందరూ దీనిని చెల్లించాల్సిందే. కానీ ఈ నిధుల ద్వారా వచ్చే ప్రయోజనాలు మాత్రం పిల్లలు ఉన్న కుటుంబాలకే అందుతాయి. అంటే ఒక రకంగా ఒంటరి వ్యక్తుల సొమ్ముతో కుటుంబాలను పోషించడం అన్నమాట.
జపాన్ జనాభా చిక్కులు..
ఒకప్పుడు జపాన్‌లో మూడు తరాల కుటుంబం కలిసి ఉండే సంప్రదాయం ఉండేది. కానీ కాలక్రమేణా అది మారిపోయింది. 2022 నాటికి జపాన్‌లో సింగిల్ పర్సన్ హోమ్స్ భారీగా పెరిగిపోయాయి. జనాభాలో మూడవ వంతు ఇళ్లలో కేవలం ఒక్కరే నివసిస్తున్నారు. కొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటుండగా.. మరికొందరు అస్సలు పెళ్లి వద్దు అనుకుంటున్నారు. వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి మరణించడం వల్ల కూడా ఒంటరి వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో తాతలు, అమ్మమ్మలు పిల్లలను చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాల్సి పరిస్థితి ఏర్పడింది జపాన్ దేశంలో. ఇందుకోసం భారీగా నిధులు అవసరమవ్వడంతో ప్రభుత్వం ఈ కొత్త మార్గాన్ని ఎంచుకుంది.
ఈ ప్రతిపాదనపై జపాన్ యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాము కావాలని పెళ్లి చేసుకోకుండా ఉండటం లేదని, పెరిగిన ఖర్చులు, తక్కువ వేతనాలు, ఆర్థిక అస్థిరత వల్లే కుటుంబాన్ని పోషించలేమన్న భయంతో ఒంటరిగా ఉండిపోతున్నట్లు అక్కడి యువత వారిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమపై అదనపు భారం వేయడం శిక్ష లాంటిదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆదాయ పన్ను, నివాస పన్ను, పెన్షన్ కాంట్రిబ్యూషన్ల పేరుతో జీతంలోనే భారీగా కోతలు విధిస్తున్నారని, ఇప్పుడు ఈ కొత్త భారం తమ పొదుపును మరింత దెబ్బతీస్తుందని యువత ఆందోళన చెందుతోంది.
పిల్లల పెంపకానికి రాయితీలు ఇవ్వడం వల్ల జనాభా పెరుగుతుందా అనేదానిపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరగడం, మారుతున్న జీవనశైలి వంటి కారణాల వల్ల జననాల రేటు తగ్గుతోంది తప్ప.. కేవలం డబ్బు లేక కాదని కొందరి వాదన. యువతపై భారం పెంచితే వారు పెళ్లిళ్లకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. జపాన్ ప్రభుత్వం చేస్తున్న ఈ వింత ప్రయత్నం ఆ దేశ భవిష్యత్తును మారుస్తుందో లేక ఒంటరి వారిని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతుందో వేచి చూడాలి.
