భద్రాద్రికొత్తగూడెం/ జూలూరుపాడు, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోలు కోసం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 168 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో 1,87,309 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశామని, ప్రభుత్వం గిట్టుబాటు ధరను కల్పిస్తుందని తెలిపారు. ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,389, బీ గ్రేడ్ రూ.2,389 మద్ధతు ధర ఉందన్నారు. సన్న రకం వడ్లకు రూ.500 బోనస్ చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
ఎండలు ఎక్కువగా ఉన్నందున కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మీటింగ్లో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ణ, అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్, ఆర్డీవో మధు తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడు కస్తూర్భా గాంధీ, పడమటి నర్సాపురం గిరిజన బాలికల పాఠశాలలను కలెక్టర్ అంకిత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల విద్యా సామర్థ్యత, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతులు పరిశీలించారు. బయోమెట్రిక్ పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
