- కాంగ్రెస్, బీఆర్ఎస్‌ది ‘ఎంఐఎం’ అజెండా: లక్ష్మణ్
హైదరాబాద్, వెలుగు: మోదీ అంటే.. మోడల్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇండియా అని, ఆయన రాకతో తెలంగాణ రాజకీయాల్లో నయా జోష్ మొదలైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. త్వరలోనే గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వేర్వేరు పార్టీలైనా అజెండా మాత్రం ఎంఐఎం అజెండానే అని విమర్శించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.
ఓ వైపు ప్రధాని మోదీ ‘వికాస్, విశ్వాస్, విరాసత్’ నినాదంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండియా కూటమికి అజెండానే లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అనే స్థాయికి దిగజారారన్నారు. రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రధాని మోదీ.. రూ. 9,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం జరిగే బీజేపీ బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
