భోపాల్: E20 పెట్రోల్ విమర్శకులపై బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కలపని ప్యూర్ పెట్రోల్ మీ అయ్యా ఇంట్లో నుంచి వస్తదా అంటూ విమర్శకులపై నోరుపారేసుకున్నారు. దేశ ప్రయోజనాలు, రైతుల శ్రేయస్సు కోసమే మోడీ సర్కార్ E20 పెట్రోల్ విధానం అమలు చేస్తోందని గట్టిగా సమర్ధించారు. ఆదివారం (ఆగస్ట్ 9) మధ్యప్రదేశ్లోని రేవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ జనార్దన్ మిశ్రా మాట్లాడుతూ.. E20 విధానాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్ఛమైన పెట్రోల్ కావాలని డిమాండ్ చేస్తున్న వారిపై చిందులు తొక్కారు.
స్వచ్ఛమైన పెట్రోల్ మీ అయ్యా ఇంట్లో నుంచి వస్తుందా అని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా 20 శాతం చమురు దేశీయంగా ఉత్పత్తి చేస్తుండగా.. 80 శాతాన్ని విదేశాల నుంచి దిగుమతి తీసుకుంటుందని తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, హౌతీల ఆంక్షలు, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి కారణాల వల్ల చమురు నౌకలు అదనంగా 18 వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇండియా రావాల్సి వస్తోందన్నారు. ఈ నేపథ్యంలోనే దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తక్కువ చేయాలనే లక్ష్యంతో మోడీ సర్కార్ E20 పెట్రోల్ విధానం తీసుకొచ్చిందని తెలిపారు.
►ALSO READ | క్రూరత్వానికి అంతే లేదా: భర్తకు మత్తు మందు ఇచ్చి ఇంట్లోనే సజీవంగా పాతిపెట్టటానికి ప్లాన్
దేశ ప్రజయోనాలను దృష్ట్యా ప్రధాని మోడీ తీసుకొచ్చిన E20 పెట్రోల్ విధానాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇథనాల వల్ల దేశ రైతులకు కూడా ప్రోత్సాహకం ఉంటుందని తెలిపారు. E20 పెట్రోల్ విధానంపై వ్యతిరేకత అనవసరమైన చర్చ అని అన్నారు. బ్రెజిల్ వంటి దేశాల్లో వాహనాలు 100 శాతం ఇథనాల్‌తోనే నడుస్తున్నాయని, ఇథనాల్ వల్ల ఇంజన్లకు ఎలాంటి నష్టం జరగదని ఆటోమొబైల్ నిపుణులు ధృవీకరించారని ఆయన పేర్కొన్నారు.
