లక్నో: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి కూడా చలాన్లు కట్టేందుకు కొందరు బుకాయిస్తుంటారు. కానీ ఓ బీజేపీ ఎమ్మెల్యే మాత్రం తాను ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించానని బహిరంగంగా ఒప్పుకోవడమే కాకుండా స్వయంగా పోలీసులను ట్రాఫిక్ చలాన్ వేయాలని అడిగి మరీ ఆ జరిమానా వెంటనే చెల్లించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పోలీసులను అడిగి మరీ చలాన్ వేయించుకుని ఫైన్ కట్టిన ఆ ఆదర్శ ఎమ్మెల్యే ఎవరో.. ఏంటో వివరాలు చూద్దాం..
బీజేపీ నేత, డియోరియా ఎమ్మెల్యే శలభ్ మణి త్రిపాఠి హెల్మెట్ ధరించకుండా బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఎమ్మెల్యే, పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. సామాన్యులకు ఒక రూల్ ప్రజాప్రతినిధులకు ఒక రూలా అని పలువురు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే త్రిపాఠి బహిరంగంగా తన తప్పును ఒప్పుకుని.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసినందుకు తనకు చలాన్ విధించాలని పోలీసులను అడిగి మరీ ఫైన్ కట్టాడు.
►ALSO READ | సొంత తీర్పును తప్పుబట్టిన సుప్రీం కోర్టు ధర్మాసనం.. ఉమర్ ఖాలీద్ బెయిల్ నిరాకరణపై అసంతృప్తి
ఈ ఘటనపై ఎమ్మెల్యే త్రిపాఠి మాట్లాడుతూ.. పార్టీకి చెందిన ఓ కార్యకర్త కొత్త బైక్ కొనుగోలు చేసి దానిని నడిపి ప్రారంభించాలని కోరాడని తెలిపారు. అతడి అభ్యర్థన మేరకు హెల్మెట్ లేకుండా బైక్ నడిపానని చెప్పాడు. ఏదేమైనప్పటికీ హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయడం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమేనని తప్పు అంగీకరించారు. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన తనకు చలాన్ విధించాలని స్వయంగా తానే పోలీసులను కోరానని చెప్పాడు.
పోలీసులు రూ.1000 జరిమానా విధించగా వెంటనే చెల్లించాని తెలిపాడు. ట్రాఫిక్ చట్టాలను పాటించడానికే కాకుండా, మన సొంత భద్రత కోసం కూడా హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని చెప్పారు. దయచేసి నేను చేసిన తప్పును మీరు చేయకండని.. వాహనం నడుపుతున్నప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించండి, నిర్లక్ష్యంగా ఉండకండని సూచించారు.
