జగిత్యాలలో సెంట్రల్ స్కూల్ సెగ...బీజేపీ నేతల అరెస్ట్

జగిత్యాలలో సెంట్రల్ స్కూల్ సెగ...బీజేపీ నేతల అరెస్ట్
  • పోలీసుల తీరుపై ఎంపీ అర్వింద్  ఫైర్

జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని బీజేపీ నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని, వెంటనే స్థలం కేటాయించాలని డిమాండ్  చేస్తూ బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. అనంతరం బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. 

ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి భోగ శ్రావణి మాట్లాడుతూ ఈ నెల 18న నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ధర్మదీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్  చౌరస్తా వద్ద నిరసన తెలుపుతున్న తమను పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకెళ్లారని మండిపడ్డారు. స్థలం కేటాయించడం చేతకాకపోతే ఎమ్మెల్యే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్  చేశారు. 

ఎంపీ స్కూల్  మంజూరు చేయిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఒక విద్యా సంవత్సరాన్ని వృథా చేసిందని విమర్శించారు. బీజేపీ నేతల అరెస్ట్​ విషయం తెలుసుకున్న ఎంపీ ఫోన్​లో జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్‌‌తో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగ శ్రావణికి గాయాలయ్యేలా ప్రవర్తిస్తారా? అంటూ నిలదీశారు. ఈ విషయాన్ని డీవోపీటీ దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు. అనంతరం అరెస్ట్​ చేసిన వారిని పోలీసులు విడుదల చేశారు.