జిల్లాల బాటపట్టిన బీజేపీ నేతలు

జిల్లాల బాటపట్టిన బీజేపీ నేతలు

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు జిల్లాల బాట పట్టారు. ఉమ్మడి జిల్లా కేంద్రాలను వేదికగా చేసుకుంటూ శక్తి కేంద్రాల (మూడు నుంచి నాలుగు పోలింగ్ బూత్ కమిటీలతో) మీటింగ్​లు నిర్వహిస్తున్నారు. వచ్చే నెల 3న హైదరాబాద్ లో నిర్వహించతలపెట్టిన ప్రధాని మోడీ బహిరంగ సభకు భారీ జన సమీకరణే లక్ష్యంగా ఈ మీటింగ్​లు జరుగుతున్నాయి. 10 లక్షల మందికి తగ్గకుండా మోడీ సభను సక్సెస్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఆ దిశగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. శనివారం పలు జిల్లాల్లో ఈ మీటింగ్​లు జరిగాయి. ఆది, సోమ వారాల్లో కూడా మరికొన్ని జిల్లాల శక్తి కేంద్రాల సమావేశాలు నిర్వహించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్​లో, ఎంపీ ధర్మపురి అర్వింద్ కామారెడ్డిలో,  మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి లక్సెట్టిపేటలో, డీకే అరుణ నిజామాబాద్​లో శనివారం జరిగిన శక్తి కేంద్రాల సమావేశాల్లో పాల్గొన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఇతర సీనియర్ నేతలు ఇప్పటికే పలు జిల్లాల్లో జరిగిన శక్తి కేంద్రాల సమావేశాల్లో పాల్గొని మోడీ సభకు జనసమీకరణపై చర్చించారు.