వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి: బండి సంజయ్

వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి: బండి సంజయ్
  • కేసీఆర్ ​ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలె: బండి సంజయ్
  • అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి: డీకే అరుణ

హైదరాబాద్ ,వెలుగు: వాల్మీకులను ఎస్టీ జాబితాలో కలపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలన్నారు. ఆదివారం వాల్మీకి, కుమ్రం భీమ్ జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్​ఆఫీసులో వారి ఫొటోలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. తర్వాత మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని మండిపడ్డారు. ఎస్టీలో కలపాలని అడుక్కునే అగత్యం లేదని, వాల్మీకులు కొట్లాడితే.. బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. వాల్మీకి వర్గానికి రాష్ట్ర సర్కార్ గౌరవం, గుర్తింపు ఇవ్వట్లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్​కు వాల్మీకులు గుర్తుకు వస్తారని డీకే అరుణ అన్నారు. వాల్మీకుల కోసం అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్, గరికపాటి మోహన్​రావు, జితేందర్ రెడ్డి, చంద్రశేఖర్, చాడ సురేశ్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఈ నెల 11న బీజేపీ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటలకు అన్ని ఆలయాల్లో ప్రొజెక్టర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సంజయ్ తెలిపారు. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో నిర్మించిన మహాకారిడార్ ను 11న ప్రధాని జాతికి అంకితం చేయనున్నారని, ఈ కార్యక్రమాన్ని భక్తులు అందరూ చూసేలా బీజేపీ రాష్ట్ర శాఖ ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు.

మార్ఫింగ్ వీడియోతో దుష్ప్రచారం: డీకే అరుణ
మునుగోడులో టీఆర్ఎస్ ఓటమి ఖాయమవడంతో సీఎం కేసీఆర్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. సరైన పాలన అందిస్తే ఎన్నికల్లో వందల కోట్లు ఎందుకు ఖర్చు పెడ్తున్నారని ఆమె ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాజకీయ నైతికతకు కట్టుబడి రిజైన్ చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డిని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అనని మాటలను అన్నట్లుగా వీడియోలను మార్ఫింగ్ చేసి ఆయనపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.