హైదరాబాద్, వెలుగు: విద్యార్థులను ఇడియట్స్ అని అవమానించిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెంటనే వారికి క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో 1,400 మంది విద్యార్థుల చావులకు కారణమైన కాంగ్రెస్ పార్టీ.. నేడు పార్లమెంట్ సాక్షిగా విద్యార్థి లోకాన్ని అవమానించడం సిగ్గుచేటన్నారు. బుధవారం హైదరాబాద్ లో తన నివాసంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో నాటి కాంగ్రెస్ కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన చేసి, ఆ తర్వాత వెనక్కి తగ్గడంతో వందలాది మంది విద్యార్థులు మనస్తాపంతో ప్రాణాలు వదిలారని ఆయన గుర్తుచేశారు.
అసలు సబ్జెక్టుపై అవగాహన లేని రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ ఇడియట్ లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ నిరసనల్లో రబ్బర్ పెల్లెట్లు వాడారంటూ అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నేతలు, గతంలో తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులను ఏ రకంగా పొట్టనబెట్టుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై లాఠీచార్జ్ చేస్తే వారేమైనా టెర్రరిస్టులా అని ప్రశ్నిస్తున్న ప్రియాంక గాంధీకి గత చరిత్ర గుర్తులేదా అని ప్రశ్నించారు.
నాడు కేంద్ర మంత్రిగా ఉన్న చిదంబరం తెలంగాణ ఇస్తామని చెప్పి యూ-టర్న్ తీసుకోవడం వల్లే వందలాది మంది విద్యార్థులు మనస్తాపంతో బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. బీజేపీని ఆర్ఎస్ఎస్ నడిపిస్తోందని విమర్శించే కాంగ్రెస్ నేతలు.. తమ పార్టీని ఇటలీ నడిపిస్తోందనే నిజాన్ని తెలుసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో తెలంగాణకు వచ్చి ప్రియాంక గాంధీ స్వయంగా ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
