పట్టభద్రుల ఆశీర్వాదంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలవబోతుందని తేల్చిచెప్పారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఇవాళ (శుక్రవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఉద్యోగ సంఘాల నాయకులకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం పీఆర్సీ ఎలా ఇస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.
జాంజాహీ మిల్లు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైందని కేసీఆర్‌ను ప్రశ్నించారు బండి సంజయ్. ఉస్మానియా, కాకతీయ వర్శిటీలను నిర్వీర్యం చేసి నలుగురు అనుచరులకు ప్రైవేటు యూనివర్సిటీలను కట్టబెట్టారని ఆరోపించారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సీఎం కేసీఆర్‌కు అనేక సార్లు సవాల్ విసిరినా ఇప్పటివరకు రాలేదన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడిస్తే ఎన్నికల హామీలు నెరవేరుతాయని తెలిపారు.
2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరవేయడమే మా లక్ష్యమన్న బండి సంజయ్.... జెండా ఎగరడం కేసీఆర్ చూడాలన్నారు.

