V6 News

రైతు భరోసా నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం

రైతు భరోసా నిలిపివేతపై హైకోర్టు ఆగ్రహం

మెదక్, వెలుగు: రైతులకు రావాల్సిన రైతు భరోసా ప్రయోజనాలను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని సంకాపూర్​ గ్రామానికి చెందిన పిటిషనర్ల భూములకు సంబంధించి రైతు భరోసా నిధులు నిలిపివేయడం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం చట్టవిరుద్ధమని గుర్తించిన న్యాయస్థానం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్,  సంబంధిత అధికారులను ఆదేశించింది. పిటిషనర్ల భూములు సుమారు 8 ఎకరాలు 32 గుంటలు ఉండగా, సివిల్ కోర్టు ఇచ్చిన తాత్కాలిక ఇంజక్షన్ ఆర్డర్‌‌ను ఆధారంగా తీసుకొని అధికారులు రైతు భరోసా ప్రయోజనాలను నిలిపివేశారు.

కాగా ఉత్తర్వులు కేవలం భూమిని అమ్మకూడదు లేదా బదిలీ చేయకూడదనే పరిమితి మాత్రమే విధించిందని, రైతు సంక్షేమ పథకాలను నిలిపివేయడానికి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లకు రావాల్సిన రైతు భరోసా నిధులను తక్షణమే విడుదల చేయాలని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లను ఆదేశించింది. అదేవిధంగా పిటిషనర్ల భూమిలో పండించిన ధాన్యాన్ని 'ఇందిరా కిసాన్ పథకం' కింద కొనుగోలు చేయడానికి అనుమతించాలని కూడా స్పష్టం చేసింది. పిటిషనర్ల తరఫున లాయర్‌‌‌‌ ఎల్. ప్రీతమ్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రతివాదికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, కేసును తదుపరి విచారణకు జూన్‌‌16కు వాయిదా వేసింది.