సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల పర్సనాలిటీ రైట్స్ రక్షణకు సంబంధించి జరుగుతున్న న్యాయ పోరాటాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరారు. తన అనుమతి లేకుండా తన పేరు, చిత్రం, గొంతును వ్యాపార అవసరాలకు వాడుకోకుండా నిరోధించాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు కోర్టును ఆశ్రయించి తమ గుర్తింపుపై చట్టపరమైన హక్కులను పొందారు.
ఢిల్లీ హైకోర్టు ఐకాన్ స్టార్
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోల బాటలోనే అల్లు అర్జున్ సైతం తన వ్యక్తిగత హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టారు. తన పేరు, ఫోటోలు, సంతకం లేదా విలక్షణమైన గొంతును వాణిజ్య ప్రకటనల కోసం, టీ-షర్టులు, ఇతర వస్తువుల అమ్మకాల కోసం విచ్చలవిడిగా వాడుతున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును జస్టిస్ తుషార్ రావు గెడెలా విచారించనున్నారు.
ఏమిటీ పర్సనాలిటీ రైట్స్?
పర్సనాలిటీ రైట్స్ అనేవి ఒక ప్రముఖ వ్యక్తికి తమ గుర్తింపుపై ఉండే చట్టపరమైన హక్కులు కలిగి ఉంటారు. ఇవి ప్రధానంగా వారి అనుమతి లేకుండా ఒకరి గుర్తింపును వ్యాపార లాభాల కోసం వాడటాన్ని ఇది అడ్డుకుంటుంది. అంతే కాకుండా ఏఐ (AI) ఉపయోగించి చేసే డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారాల నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రస్తుతం ఏఐ టెక్నాలజీతో సెలబ్రిటీల వాయిస్‌ను క్లోన్ చేయడం, ఫేస్ మార్ఫింగ్ చేయడం వంటివి ఎక్కువ కావడంతో, తన వద్ద ఉన్న 26 రిజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్‌ల ఆధారంగా బన్నీ ఈ రక్షణ కోరుతున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్ వంటి దిగ్గజాలకు కోర్టు ఇలాంటి రక్షణ కల్పించింది.
►ALSO READ | రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా మారిన బాలీవుడ్ నటి?
భారీ బడ్జెట్‌తో 'రాకా'..
ప్రస్తుతం అల్లు అర్జున్ 'రాకా' సినిమా షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్లోబల్ స్థాయిలో ఇప్పటికే అంచనాలు భారీ ఉన్నాయి. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన గుండుతో, వింతైన అర్ధ-మానవ రూపంలో కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, రష్మిక మందన్న విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సన్ పిక్చర్స్ సుమారు రూ. 700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం సోషియో-ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో వస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, 2026 చివరి నాటికి ఇది పూర్తయ్యే అవకాశం ఉంది. పుష్ప-2 రికార్డుల తర్వాత వస్తున్న సినిమా కావడంతో 'రాకా' పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

