V6 News

నడి సముద్రంలో అమెరికా సైనికుల ఆకలి కేకలు.. యుద్ధ నౌకల్లో ఆహార సంక్షోభం

నడి సముద్రంలో అమెరికా సైనికుల ఆకలి కేకలు.. యుద్ధ నౌకల్లో ఆహార సంక్షోభం

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం.. అత్యాధునిక యుద్ధ విమానాలు, భారీ నౌకలు, అంతుచిక్కని ఆయుధ సంపత్తి. ఇదీ అమెరికా రక్షణ దళం గురించి మనం తరచుగా వినే మాటలు. అయితే గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ యుద్ధం కోసం సముద్ర తీరాల్లో మోహరించిన అమెరికా నౌకల్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. శత్రువుల తూటాలకు భయపడని సైనికులు.. ఇప్పుడు ఆకలి అనే శత్రువుతో పోరాడుతున్నారు. నట్టనడి సముద్రంలో.. వేల మైళ్ల దూరంలో ఉన్న అమెరికా యుద్ధ నౌకల్లో ఆహార నిల్వలు నిండుకోవడంతో సైనికులు పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందనే వార్త సంచలనంగా మారింది.

ముఖ్యంగా వేల మంది సైనికులు ఉన్న యూఎస్ఎస్ ట్రిపోలి, యూఎస్ఎస్ అబ్రహం లింకన్ లాంటి భారీ యుద్ధ నౌకల నుంచి అందుతున్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది. వాటిలో డ్యూటీలో ఉన్న సైనికులు తమ కుటుంబ సభ్యులకు పంపిన ఫోటోలు చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఒక ప్లేట్‌లో కేవలం ఒక చిన్న ముక్క మాంసం, ఒకే ఒక రోటీ లేదా కొన్ని ఉడికించిన క్యారెట్లు మాత్రమే కనిపిస్తున్నాయి ఫొటోల్లో. తమ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని.. వారికి సరైన భోజనం అందడం లేదని సైనికుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒకప్పుడు విలాసవంతమైన భోజనానికి పెట్టింది పేరైన అమెరికా యుద్ధ నౌకల్లో.. ఇప్పుడు తాజా కూరగాయలు కూడా కనిపించడం లేదట. 

ఈ సంక్షోభానికి ప్రధాన కారణం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం, ఆంక్షలు. ఇరాన్ రేవులను దిగ్బంధనం చేసేందుకు వెళ్లిన ఈ నౌకలు.. అనుకున్న దానికంటే ఎక్కువ కాలం సముద్రంలోనే గడపాల్సి వస్తోంది. మరోవైపు వైమానిక మార్గాలు మూతపడటంతో అమెరికా పోస్టల్ సర్వీస్ దాదాపు 27 మిలిటరీ జిప్ కోడ్‌లకు మెయిల్ డెలివరీని నిలిపివేసింది. ఫలితంగా సైనికుల కుటుంబ సభ్యులు పంపిన వేల రూపాయల విలువైన ఆహార పొట్లాలు, నిత్యావసర వస్తువులు ఎక్కడో గోడౌన్లలో మగ్గిపోతున్నాయి. దాదాపు 2000 డాలర్లు ఖర్చు చేసి కేర్ ప్యాకేజీలు పంపినా.. అవి తమ బిడ్డలకు చేరడం లేదని ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

యుద్ధం అంటే కేవలం తుపాకుల మోత మాత్రమే కాదు.. అది సరఫరా గొలుసును కూడా దెబ్బతీస్తుందని ఈ ఘటన నిరూపిస్తోంది. యుద్ధ భూమిలో ఉన్న సైనికులకు కడుపు నిండా తిండి లేకపోతే వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందనేది ఓపెన్ సీక్రెట్. అగ్రరాజ్యం తన సైనికుల విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శత్రువును ఓడించడం సంగతి పక్కన పెడితే.. సొంత సైనికుల ఆకలిని తీర్చడం ఇప్పుడు పెంటగాన్‌కు అతిపెద్ద సవాలుగా మారింది. సరఫరా మార్గాలు పునరుద్ధరించబడే వరకు ఆ సైనికులకు ఈ 'ఆకలి యుద్ధం' తప్పేలా లేదు.