యువత గొంతు నొక్కొద్దు.. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

యువత గొంతు నొక్కొద్దు.. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను రోడ్డెక్కి ప్రశ్నిస్తోన్న యువత గొంతు నొక్కొదని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. శాంతియుతంగా తమ ఆందోళన వ్యక్తం చేస్తోన్న విద్యార్థులను పోలీసులు రక్తం వచ్చేలా లాఠీలతో కొట్టినందుకు ప్రధాని మోడీ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

సీజేపీ పార్లమెంట్ మార్చ్‎లో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంగళవారం (జులై 21) రాహుల్ గాంధీ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరసనకారులపై పోలీసుల బలప్రయోగంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. విద్యార్థులు, నిరసనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యా్స్ ప్రయోగించిన పట్టించుకోరా అని నిలదీశారు.

మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తోన్న దేశ యువత గొంతు నొక్కొదని హితవు పలికారు. సీజేపీ నిరసనకారులపై పోలీసుల దమనకాండకు బాధ్యతగా ప్రధాని మోడీ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇకనైనా శాంతియుతంగా ఆందోళన వ్యక్తం చేస్తోన్న నిరసనకారులపై లాఠీచార్జ్ వంటి పిచ్చి పనులు ఆపాలని సూచించారు. అయినా.. దేశంలో విద్యా వ్యవస్థ, పరీక్ష విధానం నాశనం అయిపోయిందని దేశమంతటికీ తెలుసన్నారు.

దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని మండిపడ్డారు. చదువు, భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీదెబ్బలు, అరెస్టులు బహుమతిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్లు లీక్ నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, న్యాయం కోసం గొంతెత్తిన విద్యార్థులను చితక్కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవు పలికారు. 

మన విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యాసంస్థలన్నీ ఒకే ఒక్క సంస్థ చేతుల్లో నడుస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. దీనిపైనే దేశ యువత తిరగబడుతోందని, వారి డిమాండ్లను ప్రధాని వెంటనే అంగీకరించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీ కేవలం 'అసత్యం, హింస' అనే భారత్ వ్యతిరేక సూత్రాలను నమ్ముతూ యువతను అవమానిస్తున్నారని విమర్శించారు.