సమన్ల విషయంలో కన్ఫ్యూజన్.. రకుల్ ప్రీత్ విచారణ వాయిదా

సమన్ల విషయంలో కన్ఫ్యూజన్.. రకుల్ ప్రీత్ విచారణ వాయిదా

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ కేసులో డ్రగ్ కోణం కీలకంగా మారింది. తాజాగా డ్రగ్ కేసులో నలుగురు టాప్ హీరోయిన్స్‌‌కు నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో నోటీసులు జారీ చేసింది. హిందీ టాప్ హీరోయిన్స్ దీపికా పడుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌‌తోపాటు రకుల్ ప్రీత్ సింగ్‌‌కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. తాజాగా ఈ వివాదంపై రకుల్ ప్రీత్ స్పందించింది. ఎన్సీబీ నుంచి తాను సమన్లు అందుకోలేదని తెలిపింది. హైదరాబాద్‌‌తోపాటు ముంబైలో కూడా తనకు సమన్లు అందలేదని పేర్కొంది. ఆమె సమన్లు అందుకోలేదని రకుల్ ప్రీత్ మేనేజర్ ఓ ప్రకటనలో తెలిపారు. యాడ్ ఫిల్మ్ షూటింగ్‌‌లో ఉన్న రకుల్ బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబైకి చేరుకుంది. ఎన్సీబీ వర్గాల ప్రకారం ఆమెను ఇవ్వాళ విచారించాల్సి ఉంది. ఈ విషయంపై ఎన్సీబీ అధికారి కేపీఎస్ మల్హోత్రా క్లారిటీ ఇచ్చారు. ‘రకుల్‌‌కు సమన్లు జారీ చేశాం. ఫోన్‌‌తోపాటు వేర్వేరు విధాలుగా ఆమెను సంప్రదించడానికి యత్నించాం. కానీ ఆమె అందుబాటులోకి రాలేదు. ఆమె నుంచి ఎలాంటి స్పందనా రాలేదు’ అని మల్హోత్రా చెప్పారు. ఇదొక సాకు మాత్రమేనని, ఇవ్వాళ విచారణలో రకుల్ పాల్గొనదని, రేపు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయిని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి.