హ్యాంబర్గ్: బోనాల పండుగను జర్మనీలోని హ్యాంబర్గ్ సిటీలో తొలిసారిగా వైభవంగా నిర్వహించారు. ‘తెలంగాణ అసోసియేషన్ ఎన్‌ఆర్‌ఐ హ్యాంబర్గ్’ (టీఏఎన్‌హెచ్)ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తెలంగాణ కుటుంబాలు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించి, బోనాలు సమర్పించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ అధ్యక్షుడు రఘు చాలిగంటి హాజరయ్యారు.
విదేశాల్లో ఉన్న తెలంగాణ సంఘాలు పండుగల నిర్వహణే కాకుండా, భావి తరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను అందించాలన్నారు. జర్మనీకి వచ్చే విద్యార్థులు, ఉద్యోగార్థులకు విద్య, వృత్తి రంగాల్లో తగిన మార్గదర్శకత్వం, సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇటీవల మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్ ద్వారా జర్మనీతో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, పారిశ్రామిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీనివాస్ బసవరాజును, టీఏఎన్‌హెచ్ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన అంపన్న రెడ్డి వుటుకూరి, రాహుల్ తుల, ఉదయ్ రెడ్డి కుడుముల, వినీత్ రెడ్డి, సత్యనారాయణ, రామ్‌ను ప్రశంసించారు
