- బ్యాటింగ్ కోచ్‌గా కొత్తవారికి చాన్స్
- అరుణ్‌కు ఎక్స్‌టెన్షన్ దక్కొచ్చు!
- జాంటీ రాకతో శ్రీధర్‌కు ఇబ్బందే
వెలుగు క్రీడా విభాగం : టెస్ట్‌ల్లో వరల్డ్ నంబర్‌వన్, వన్డేల్లో నంబర్ టు.. టీ20ల్లోనూ అద్భుతమైన పెర్ఫామెన్స్.. వ్యక్తిగతంగానూ ఆటగాళ్లలో గణనీయంగా మెరుగుపడిన ఫిట్‌నెస్ లెవల్స్.. గంటలకొద్ది క్రీజులో నిలబడే ఓపిక.. డబుల్ సెంచరీలు కొట్టినా అలుపురాని పరిస్థితి.. ఫీల్డింగ్‌లో అత్యుత్తమ నైపుణ్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే టీమిండియా ఘనతల గురించి ఎంతైనా మాట్లాడొచ్చు. ఒకప్పటి ఇండియా టీమ్‌కు.. ఇప్పుడున్న విరాట్‌సేనకు ఏమాత్రం పోలిక లేదు. కేవలం ఐదేళ్ల వ్యవధిలో ఇండియా టీమ్ ఇంతలా మెరుగుపడటానికి కారణాలేంటి.. అంటే తెర వెనుక ఉండే సహాయక సిబ్బంది పాత్రే అని కచ్చితంగా చెప్పొచ్చు. ఓ ఆటగాడి నైపుణ్యాన్ని గుర్తించి అతన్ని టీమ్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో వీళ్ల పనితీరు అత్యంతం కీలకం. అలా చేసిన వారిలో సంజయ్ బంగర్, భరత్ అరుణ్, ఆర్. శ్రీధర్ చాలా ముఖ్యలు. మరి వీళ్లను బీసీసీఐ కొనసాగిస్తుందా?
మిడిల్ దెబ్బ..
2014 ఆగస్ట్‌లో టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా పగ్గాలు చేపట్టిన బంగర్‌కు ఈసారి ఎక్స్‌టెన్షన్ దక్కపోవచ్చు. ఆరంభంలో ప్రతి క్రికెటర్‌పై ప్రత్యేక దృష్టిసారించిన బంగర్.. అందుకు తగిన ఫలితాలను కూడా రాబట్టాడు. అదే క్రమంలో టాప్ ఆర్డర్‌లో రోహిత్, కోహ్లీ అద్భుతంగా ఆడటం వల్ల టీమిండియాకు వరుసగా విజయాలు దక్కాయి. దీంతో బంగర్‌కు కూడా క్రెడిట్ దక్కింది. కానీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమి తర్వాత మొదటిసారి బంగర్ పనితీరుపై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా జట్టుకు వెన్నెముకలా ఉండే బలమైన మిడిలార్డర్‌ను తయారు చేయలేకపోయాడనే అతిపెద్ద విమర్శ అతనిపై ఉంది. బంగర్ చెప్పినా, చెప్పకపోయినా కోహ్లీ, రోహిత్ ఎలాగైనా ఆడతారు. కానీ మిడిల్‌లో ఆడే బలమైన క్రికెటర్‌ను బంగర్ కనిపెట్టలేకపోయాడు. పదుల సంఖ్యలో ఆటగాళ్లను పరీక్షించినా అందులో నుంచి ఒక్కర్ని కూడా సెలెక్ట్ చేయలేకపోయాడు. బంగర్ కోచింగ్ కెరీర్‌లో ఇది అతిపెద్ద మైనస్. ద్వైపాక్షిక సిరీస్‌లో మిడిల్ సమస్యను ఎలాగోలా గట్టెక్కించినా.. వరల్డ్‌కప్‌లో మాత్రం అసలు సమస్య ఏంటో స్పష్టంగా కనిపించింది. రాయుడును తప్పించడం, విజయ్ శంకర్‌ను తీసుకోవడం, గాయంతో ఉన్న కేదార్‌కు ఓకే చెప్పడం ఇవన్నీ తప్పిదాలే. అవకాశం వచ్చినా మిడిలార్డర్‌కు సరిపోయే ఆటగాళ్లను ఎంపిక చేయలేకపోయాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో ధోనీని ఏడో స్థానంలో పంపాలన్న నిర్ణయం తీసుకొని చేటును కొని తెచ్చుకున్నాడు.
అరుణ్ అదుర్స్
రెండేళ్లుగా టీమిండియా బౌలింగ్ నైపుణ్యాన్ని చూస్తే భరత్ అరుణ్ శ్రమ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు లేనంతగా టెస్టుల్లో అత్యంత బలమైన బౌలింగ్ లైనప్‌ను ఇండియాకు కానుకగా ఇచ్చాడు. లిమిటెడ్ ఓవర్లకే పరిమితమైన బుమ్రాను వరల్డ్ క్లాస్ పేసర్‌గా నిలబెట్టడంలో అతను సూపర్ సక్సెస్ అయ్యాడు. డెత్ ఓవర్లలో బుమ్రా బౌలింగ్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోయేలా తయారు చేశాడు. గాయాలు, ఫిట్‌నెస్ లేమితో ఇబ్బందులుపడే మహ్మద్ షమీని సూపర్ స్టార్‌ను చేశాడు. ఒక్క మ్యాచ్ ఆడితే రెండో మ్యాచ్‌లో ఉంటడో, ఉండడో తెలియని షమీ ఇప్పుడు టీమిండియా బౌలింగ్ పొదిలో ప్రధాన అస్త్రం. వరల్డ్‌కప్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే షమీ హ్యాట్రిక్ తీసి తన బౌలింగ్ ఏంటో చూపెట్టాడు. షమీ ఇంతలా ఎదగడం వెనుక భరత్ ఉన్నాడనేది వంద శాతం నిజం.
శ్రీధర్‌కు రోడ్స్ గండం
రామకృష్ణన్ శ్రీధర్.. ఆర్. శ్రీధర్‌గా సుపరిచితుడైన ఈ హైదరాబాద్ మాజీ క్రికెటర్ చేరిక తర్వాత టీమిండియా ఫీల్డింగ్ చాలా మెరుగుపడింది. కొత్త కొత్త టెక్నిక్స్‌తో జట్టులో ప్రతీ ఆటగాడిని సూపర్ అథ్లెట్‌గా మార్చాడు. మన ఫీల్డరు గ్రౌండ్‌ల్లో చిరుత పులుల్లా కదులుతున్నారంటే అది శ్రీధర్ చలువే. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ ఫీల్డింగ్ జట్లలో టీమిండియాకు కూడా చోటు దక్కించిన శ్రీధర్‌కు ఎక్స్‌టెన్షన్ అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఎందుకంటే ఫీల్డింగ్‌కే పర్యాయపదంగా ఉన్న జాంటీ రోడ్స్ ఈసారి ఈ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఫీల్డింగ్ కోచ్‌గా అందర్ని మెప్పించాడు. బోర్డులో ఉండే పెద్ద తలకాయలు కూడా అతనిపట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కమిటీ.. రోడ్స్‌కు చాన్సిస్తుందా? లేక శ్రీధర్‌ను కొనసాగిస్తుందా? అన్నది ఆసక్తికరం.

