- పెనగడప, న్యూ పత్రపాడను సింగరేణి రిటర్న్ చేసింది
- రాజ్యసభలో బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబె
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన బొగ్గు గనులను నడిపే సామర్థ్యం లేక నాటి బీఆర్ఎస్ సర్కార్... ఆ బ్లాక్ లను తిరిగి తమకు అప్పగించిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ వెల్లడించింది. ‘‘నైనీతో పాటు పెనగడప, న్యూ పత్రిపాడ బ్లాక్ లను గతంలో తెలంగాణకు కేంద్రం కేటాయించింది. కానీ, ఈ బ్లాక్ లను నడిపే సామర్థ్యం లేక 2022 లో పెనగడప, న్యూ పత్రిపాడ బ్లాక్ లను నాటి బీఆర్ఎస్ ప్రభుతం కేంద్రానికి తిరిగి అప్పగించింది.
అయితే నైనీ లో మాత్రం బొగ్గు ఉత్పతి జరిగినా... సరఫరా మాత్రం జరగలేదు’’ అని స్పష్టం చేసింది. తాడిచర్ల –I ను మాత్రం 2015 లోనే తెలంగాణ విద్యుత్ సంస్థకు కేటాయించినట్లు తెలిపింది. అయితే... తాడిచర్ల – II మాత్రం ఎవరికీ కేటాయించలేదని స్పష్టం చేసింది.
రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ కోల్బ్లాక్పై క్వశ్వన్ అవర్‌లో అడిగిన ప్రశ్నలకు కేంద్రం జవాబు చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరుతున్నప్పటికీ, తాడిచర్ల కోల్ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు కేంద్ర బొగ్గు శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబె సమాధానం ఇచ్చారు. తెలంగాణలోని తాడిచర్ల కోల్‌బ్లాక్‌కు అంత ప్రాధాన్యత ఏముందని, ఇతర కోల్ బ్లాక్‌ల కంటే ఎందుకు భిన్నమో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలన్నారు.
2020 నుంచి ఇప్పటి వరకు నీతి ఆయోగ్ ద్వారా ఇప్పటివరకు 136 కోల్ బ్లాక్‌లు వేలం వేసినట్లు వివరించారు. సింగరేణి రూ.6 వేల కోట్లకుపైగా లాభం ఆర్జించిందని, ఇంత భారీ లాభాలు అర్జిస్తున్న సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకుల వేలంలో ఎందుకు పాల్గొనదని మంత్రి ప్రశ్నించారు. నీతి ఆయోగ్ సూచన మేరకు 2020 నుంచి వేలం ద్వారానే బొగ్గు బ్లాకులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధింత శాఖ నుంచి ప్రతిపాదన పంపితే పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సభకు తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆశలను బడ్జెట్ నెరవేర్చలేదు...
కేంద్ర బడ్జెట్‌పై అనిల్ కుమార్ నిరాశ వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు పెద్ద ఆశలు పెట్టుకున్నప్పటికీ అవి నెరవేరలేదన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు, ఐఐఎం స్థాపన, హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2, రివిజినల్ రింగ్ రోడ్ (త్రిపుల్ ఆర్) వంటి కీలక ప్రాజెక్టులకు బడ్జెట్‌లో ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
