హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణలో పకడ్బందీగా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను బీజేపీ టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య కోరారు. గురువారం లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఎమ్మెల్సీ.. రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలు తీరుపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 22 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ వినతిపత్రం సమర్పించారు.
ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఫ్లాగ్‌షిప్ స్కీములు క్షేత్రస్థాయిలో అస్తవ్యస్తంగా ఉన్నాయని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు, పీఎం సురక్షా బీమా, పీఎం జీవన్ జ్యోతి బీమా వంటి ఇన్సూరెన్స్ పథకాలు సరిగా అమలు కావడం లేదన్నారు. పీఎం ఫసల్ బీమా యోజనను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయకపోవడంతో.. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన అన్నదాతలకు నయాపైసా పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
