బషీర్‌బాగ్, వెలుగు : కోఠి మహిళా వర్సిటీ వీసీని తిట్టిన కేసులో గోషామహల్ బీఆర్ఎస్ నేత గడ్డం శ్రీనివాస్ యాదవ్‌పై సుల్తాన్ బజార్ పీఎస్‌లో కేసు నమోదైంది. సీఐ బాలగంగాధర్ రెడ్డి తెలిపిన ప్రకారం.. ఈనెల 1న మహిళా వర్సిటీ వీసీ విజ్జులత చాంబర్‌కు వెళ్లిన గడ్డం శ్రీనివాస్ తాను సోషల్ వర్కర్‌నని పరిచయం చేసుకున్నాడు. బాలికలకు ఉచిత విద్య, స్కాలర్షిప్లను అందిస్తున్నట్లు చెప్పాడు. తనకు వర్సిటీ తరఫున సన్మానం చేయాలని కోరాడు. వర్సిటీ అభివృద్ధికి ఆర్థికంగా సహకారం అందించాలని వీసీ సూచించారు.
దీంతో శ్రీనివాస్ ‘నేను గోషామహల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిని. నువ్వేమైనా ఐఏఎస్వా, ఐపీఎస్ ఆఫీసర్వా?.. వీసీ అయ్యాక నీ కళ్లు నెత్తికెక్కినయ్’.. అంటూ దురుసుగా ప్రవర్తించాడు. దీంతో వీసీ అతడిపై సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ తెలిపారు.
