- బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే కేసీఆర్ క్యాంప్ ఆఫీస్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యంపై సీఎం చేయించిన దాడిగా అభివర్ణించారు. కాంగ్రెస్ నాయకుల తీరు బిహార్ గ్యాంగ్ ను తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపై ముప్పేట దాడులు చేస్తుంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నట్టా.. లేనట్టా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాలు, మీడియాపై దాడులు నిత్యకృత్యం కావడం సిగ్గుచేటన్నారు.
శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ప్రైవేట్ సైన్యంలా మారిపోయారని ఆరోపించారు. ఒకవైపు హేట్ స్పీచ్ బిల్ పేరుతో ప్రజలు, ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తూ, మరోవైపు కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించడమేన ప్రజాపాలనా..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం అని చెబుతూ గూండా రాజ్యం అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
