ఢాకా: ఇండియాతో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు బంగ్లాదేశ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం (ఏప్రిల్ 4) బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ అధ్యక్షతన శనివారం (ఏప్రిల్ 4) బీసీబీ సమావేశమైంది. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, బీసీసీఐ మధ్య సంబంధాలపై చర్చించారు. బంగ్లా క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ అబెదిన్ ఫహీమ్ భేటీ వివరాలను వెల్లడించారు.
ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాల పునరుద్ధరణ కోసం బీసీసీఐకి లేఖ రాసినట్లు తెలిపారు. లేఖలో ద్వైపాక్షిక సిరీస్‌ల గురించి ప్రస్తావించామని.. అలాగే 2026, సెప్టెంబర్‌లో టీమ్‌ఇండియా బంగ్లాలో పర్యటించమని కోరామని వెల్లడించారు. ఐసీసీ షెడ్యూల్ మేరకు ఈ ఏడాది బంగ్లా టీమ్ ఇండియాలో పర్యటించాల్సి ఉందని.. ఈ టూర్‌కు సహకారం అందించాలని రిక్వెస్ట్ చేసినట్లు చెప్పారు.
►ALSO READ | IPL 2026: జురెల్, జైస్వాల్ జోరు.. వైభవ్ హోరు.. గుజరాత్ ముందు భారీ టార్గెట్!
మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వ హయాంలో ఇండియా, బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. బంగ్లాలో మెనార్టీలపై దాడులకు నిరసనగా ఐపీఎల్లో ఆ దేశ ప్లేయర్లు ఆడకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది. ఇందులో భాగంగానే కేకేఆర్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌పై వేటు వేసింది బీసీసీఐ. ఈ చర్యపై అప్పటి యూనస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐపీఎల్లో బంగ్లా ప్లేయర్లపై వేటుకు నిరసనగా తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది యూనస్ సర్కార్. ఈ క్రమంలోనే 2026, ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగగా తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని బీఎన్పీ పార్టీ ఘన విజయం సాధించింది. బంగ్లా నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రెహ్మాన్ భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఇండియాతో క్రికెట్ సంబంధాల పునరుద్ధరణకు కృషి చేస్తోంది.
