హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పోలీసులకు, యూత్ కాంగ్రెస్ నాయకులకు మధ్య నడిచిన నడుమ రోడ్డు రచ్చతో వాతావరణం వేడెక్కింది. ఇందిరా పార్క్‌లోని ధర్నా చౌక్ వైపు బయలుదేరిన యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో.. కాంగ్రెస్ నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇవాళ ధర్నా చౌక్ దగ్గర BRSV నిరసనకు పిలుపునివ్వగా.. కేటీఆర్ నల్ల చొక్కా ధరించి ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు వ్యతిరేకంగానే యూత్ కాంగ్రెస్ ఆందోళనకు సిద్ధమైంది.గతంలో గ్లోబరీనా సంస్థ వైఫల్యం కారణంగా ఎందరో విద్యార్థులు బలికావడానికి, ఇంటర్ పేపర్ లీక్ వ్యవహారానికి కేటీఆరే కారణమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈ ఘటనలకు కేటీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోంది.పోలీసుల ముందస్తు అరెస్టులతో ఉద్రిక్తత కొనసాగుతుండగా.. హైదరాబాద్ రాజకీయం మరింత వేడెక్కింది
