- కేటీఆర్ ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: సీతారామ ఎత్తిపోతల పథకంలో అనుమతులు లేకుండానే రూ.1,074 కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధనలను ఎలా తుంగలోకి తొక్కారంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ప్రాజెక్టు పూర్తయి కోటి ఎకరాలకు జీవం పోస్తున్న కాళేశ్వరంపై కమిషన్లు వేసి విచారణ చేస్తున్న కాంగ్రెస్ పాలకులపై ఇప్పుడు ఏ కమిషన్ వేయాలన్నారు.
ప్రజాపాలన అంటూ పొద్దుకు పదిసార్లు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. మత్స్యకారుల జీవితాల్లోనూ సర్కారు మట్టికొట్టిందన్నారు. ప్రభుత్వం మారితే పథకాల పేర్లు మారుతాయేగానీ.. కాంగ్రెస్ పాలనలో పథకాలే నామరూపాల్లేకుండా పోయాయని మండిపడ్డారు. ముదిరాజ్ లు, బెస్తవాళ్ల దీన స్థితిని పట్టించుకోవడం లేదన్నారు.
