దేశంలో డ్రగ్స్ వినియోగం గత కొన్ని దశాబ్దాలుగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం తీవ్రమైన సామాజిక సమస్యగా డ్రగ్స్ వినియోగం తయారైంది. కేవలం వ్యక్తిగత ఆరోగ్యాన్ని, కుటుంబ వ్యవస్థను, ఆర్థికస్థితినీ, సమాజ స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. యువత డ్రగ్స్ వాడకాన్ని సరదాకి మొదలుపెట్టి, ఆ తర్వాత దానిలోని మత్తును ఆస్వాదించి వదులుకోలేక బానిసగా మారుతోంది. నానాటికీ పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్తును సమూలంగా మార్చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయంగా మారింది.
దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా యువత భవిష్యత్తును నాశనం చేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దీనిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ సముద్ర మార్గాల్లో, ముఖ్యంగా గుజరాత్ వంటి తీరప్రాంతాల ద్వారా భారీగా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోంది. గంజాయితోపాటు కొకైన్ వంటి సింథటిక్ డ్రగ్స్ కూడా రవాణా అవుతోంది. డ్రగ్స్ వినియోగం పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జీవితంలో ఒత్తిడి, నిరాశ, కుటుంబ సమస్యలు కూడా యువతరాన్ని డ్రగ్స్ వైపు నెడుతున్నాయి. చివరికి డ్రగ్స్‌కు బానిసలైపోతున్నవారు ఎందరో ఉన్నారు.
- యువతలో ప్రతికూల ప్రభావాలు
డ్రగ్స్ వినియోగం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గుండె సంబంధిత సమస్యలు చుట్టుముడతాయి. ఊపిరితిత్తుల వ్యాధులు తలెత్తుతాయి. మెదడు పనితీరు మందగిస్తుంది. ఆ తర్వాత మానసిక కుంగుబాటు మొదలవుతుంది. డిప్రెషన్, ఆందోళన, భయం వంటివి ఎదురవుతాయి. కొన్నాళ్ళకు ఆలోచనా శక్తి కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. చివరికి సాధారణ జీవితం గడపడం అత్యంత కష్టంగా మారుతుంది. డ్రగ్స్ తీసుకున్న వ్యక్తి మాత్రమే కాకుండా బాధితుడి కుటుంబం కూడా నిరాశలో కూరుకుపోతుంది. ఆర్థిక సమస్యలు వెంటాడతాయి.
ఫలితంగా నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. సమాజంలో నేరాల రేటు పెరగడానికి కారణమవుతుంది. వ్యక్తిగత సమస్యగానే కాకుండా ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. పనిచేసే వయసులో డ్రగ్స్ కు అలవాటుపడితే ఉత్పాదక కోల్పోతారు. దీనివల్ల దేశ ప్రగతికి అవరోధం ఏర్పడుతుంది. దేశ భద్రతకు కూడా ముప్పు కలిగిస్తుంది. ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం కఠిన చట్టాలు అమలు చేస్తోంది. డ్రగ్స్ సరఫరాను అరికట్టడానికి
పోలీసుశాఖ, ఇతర సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, డ్రగ్స్వినయోగం పూర్తిస్థాయిలో నిర్మూలించడం కష్టతరంగా మారింది.
- అవగాహనతో సమస్య పరిష్కారం
ప్రభుత్వం మాత్రమే కాకుండా సమాజం మొత్తం ఈ సమస్య పరిష్కారానికి ముందుకురావాలి. కుటుంబ సభ్యులు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వారి నడవడిక మీద దృష్టి పెట్టాలి. వారి ప్రవర్తనలో మార్పులు గమనిస్తే వెంటనే స్పందించాలి. విద్యాసంస్థలు కూడా విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం చూపించాలి. వారిలో ఆత్మవిశ్వాసం పెంచే కార్యక్రమాలు నిర్వహించాలి. యువత తమ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి.
చెడు వైపు మనసు వెళ్లకుండా నియంత్రించుకోవాలి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఒత్తిడి వచ్చినప్పుడు దాన్ని అధిగమించడానికి కుటుంబ సభ్యులతో చర్చించాలి. స్నేహితులతో భావాలు పంచుకోవచ్చు. డ్రగ్స్ వైపు, లేదా ఇతర చెడు మార్గాల వైపు యువత మొగ్గు చూపడం శ్రేయస్కరం కాదు. జీవితాన్ని వృథా చేసినట్టవుతుంది. డ్రగ్స్ వినియోగం తీవ్రమైన సమస్యే. అయినా సరైన అవగాహనతో దీన్ని నియంత్రించవచ్చు. డ్రగ్స్ కు దూరంగా ఉంటే ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించడం కష్టం కాదు.
- జి. యోగేశ్వరరావు, జర్నలిస్ట్
