- విభజన జరిగినప్పుడు 11 రోజులు అన్నం తినలేదన్న పవన్ కల్యాణ్.. ఇక్కడెలా సభ పెడ్తరు?: కేటీఆర్
- ఆయన దగ్గర జాతీయవాదం గురించి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు
- తెలంగాణ ఓజీ కేసీఆర్.. ఆయన ఉన్నంతకాలం రాష్ట్రానికి ఏం కాదు
- మమకారంతో మేం పాలన చేస్తే.. అహంకారమనే ముద్ర వేశారు
- ప్రజల విచక్షణను నేనేమీ అవమానించలేదు.. బాల్క సుమన్ మాటలు కచ్చితంగా తప్పే
- కాంగ్రెసోళ్లు కూడా హింసకు పాల్పడేలా కామెంట్లు చేసినా వాళ్ల మీద కేసులు పెట్టట్లే
- పాలమూరు -రంగారెడ్డిపై మాకేమీ కక్ష లేదు.. ఆ ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేసినం
- రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడ్తే 90 సీట్లు గెలుస్తామని ధీమా
- హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ మీట్ ది ప్రెస్‌లో కామెంట్స్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కచ్చితంగా ఇక్కడి భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘తెలంగాణ మీ అయ్య జాగీరా’ అన్న పవన్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. బుధవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. పవన్‌కల్యాణ్ అయినా.. ఇంకెవరైనా ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చని, వ్యాపారాలూ చేసుకోవచ్చని చెప్పారు. సోదరుడిగా పవన్ కల్యాణ్ తమ ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెడతానని, కానీ, తమ సెక్రటేరియెట్‌లోకి వస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.
పవన్‌కల్యాణ్ దగ్గర జాతీయవాదం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు 11 రోజులు అన్నం తినలేదని పవన్‌కల్యాణ్ అన్నారని, అలాంటి వ్యక్తి వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే ఇక్కడ సభ పెట్టాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కన్నా ప్రమాదమంటున్నారని, మరి, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహారదీక్ష చేశారని, అది ప్రాంతీయవాదం కాదంటారా? అని ప్రశ్నించారు.
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఇచ్చినా.. ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితులను తెచ్చింది మాత్రం కేసీఆరేనని చెప్పారు. తెలంగాణ ప్రజల పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమైందన్నారు.
1952లో ఆంధ్రాలో హైదరాబాద్విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమంలో ఏడుగురిని పొట్టనపెట్టుకున్నదీ, 1969 తొలిదశ ఉద్యమంలో 379 మంది ఉద్యమకారులను బలిగొన్నదీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని తెలిపారు. తెలంగాణ ఓజీ (ఒరిజినల్గ్యాంగ్స్టర్) కేసీఆర్ అని, ఆయన ఉన్నంత వరకూ తెలంగాణను ఎవరూ ఏమీ చేయలేరని కేటీఆర్చెప్పారు. రామాయణం, మహాభారతంలాంటి కథలను ప్రతి ఒక్కరూ తెలుసుకున్నట్టే.. తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ కథలో శిఖండులు, శకునులు, మారీచులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణను తాము మమకారంతో పాలించామని, కానీ అహంకారమనే ముద్ర వేశారని అన్నారు. అధికారం పోయిందనే బాధ తమకు లేదని, తెచ్చుకున్న రాష్ట్రం మళ్లీ తెలంగాణ ద్రోహుల చేతుల్లోకే వెళ్లిందనే బాధ మాత్రం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ కల్చరే సీల్డ్ కవర్ కల్చర్ అని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్లే ముఖ్యమంత్రి అని ఆరోపించారు. ‘‘ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగితే.. పెండ్లయిన 3 నెలల్లో పిల్లలు పుడతారా? అని సీఎం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 30 నెలలు అవుతున్నది. మరి, 30 నెలల్లో కూడా పిల్లలు పుట్టకపోతే ఏమనాలి?’’ అని ప్రశ్నించారు. ఈ టైమంతా కేసీఆర్‌ను తెలుసుకోవడానికే సరిపోయిందని ఎద్దేవా చేశారు.
దేశానికే అన్నం పెట్టేస్థాయికి తీసుకెళ్లినం..
తెలంగాణ వచ్చిన కొత్తలో రాష్ట్రాన్ని పాలించడం తెలుసా? అని ఎంతో మంది అడిగారని, కానీ, రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టేస్థాయికి కేసీఆర్ తీసుకెళ్లారని కేటీఆర్ చెప్పారు. చాలా రాష్ట్రాలు కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని అడిగారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పు 2.80 లక్షల కోట్లేనని తెలిపారు. ఆ అప్పుతో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు కట్టడంతోపాటు అనేక సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రెండున్నరేండ్ల పాలనలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు 4 లక్షల కోట్లు. అప్పు చేసినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారు. మోదీ తానా అంటే రేవంత్ రెడ్డి తందానా అంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసేలా వారి ప్రయత్నాలున్నాయి. మోటర్లకు మీటర్లు పెట్టేందుకు సిద్ధమయ్యారు. మోటార్లకు మీటర్లు పెట్టబోమని సీఎం చెబుతున్నా.. ట్రాన్స్‌ఫార్మర్లకు మాత్రం పెడుతామంటున్నారు. అంటే ఆరేడుగురు రైతులకు ఓ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. దాన్నేమంటారు?’’ అని ఆయన ప్రశ్నించారు.
బాల్క సుమన్ మాటలు తప్పే..
బాల్క సుమన్ నిజంగా హింసాత్మక ధోరణిలో మాట్లాడి ఉంటే తప్పేనని కేటీఆర్ అన్నారు. కానీ, అదే సమయంలో కాంగ్రెస్ నేతలు కూడా ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన సందర్భాలున్నాయని తెలిపారు. వాళ్లను ఎందుకు అరెస్ట్ చేసి జైలులో పెట్టడం లేదని ప్రశ్నించారు. ఫ్యూచర్‌సిటీ అనేది లేనే లేదన్నారు. అధికారంలోకి వస్తే కచ్చితంగా ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని చెప్పారు. ఫార్మా సిటీ కోసం భూమిని సేకరించేందుకు ఏడేండ్లు పట్టిందని తెలిపారు. ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో జర్నలిస్టులకు ఇండ్లు, పార్క్ లకు జాగాలు ఇస్తామని రేవంత్ అంటున్నారని, కచ్చితంగా హరీశ్‌రావు అన్న మాటలు అక్షర సత్యమని చెప్పారు. జర్నలిస్టులకు ఇండ్లు ఇవ్వాలనుకుంటే మంచిరేవుల, బుద్వేల్‌లో ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో జిల్లాల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చామని గుర్తు చేశారు. కానీ, హైదరాబాద్‌లో విలువైన భూముల వల్లే జర్నలిస్టులకు ఇవ్వలేకపోయామని చెప్పారు.
90 సీట్లు గెలుస్తం..
రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కచ్చితంగా 90 స్థానాల్లో గెలుస్తామని కేటీఆర్ధీమా వ్యక్తం చేశారు. కొడంగల్‌లో రేవంత్ ఓడిపోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ మరో 20 ఏండ్లపాటు అడ్రస్ లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, 2027లో పాదయాత్ర చేస్తానని తెలిపారు. తామేమీ ప్రజల తీర్పును అవమానించడం లేదని కేటీఆర్ చెప్పారు. నమ్మి మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశామని సోషల్ మీడియాలో ప్రజలు తిట్టిపోస్తున్నారని, దాన్నే తాను చెప్పానని అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును 90 శాతం పూర్తి చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనన్నారు. రెండు పెద్ద ప్రాజెక్టులను కడుతున్నప్పుడు కొన్ని టెక్నికల్ సమస్యలతో ఒక ప్రాజెక్టుపై ప్రభావం పడడం సహజమని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు జైపాల్‌రెడ్డి పేరు పెట్టారు.. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలి కదా? అని ప్రశ్నించారు.
