మంచి ఫలితాలే సాధించినం .. మున్సిపల్ ఎన్నికల రిజల్ట్స్ పై కేటీఆర్

మంచి ఫలితాలే సాధించినం .. మున్సిపల్ ఎన్నికల  రిజల్ట్స్ పై కేటీఆర్
  • అధికార పార్టీ 80 నుంచి 90 శాతం గెలిస్తేనే గెలుపు
  • రెండేండ్లలోనే కాంగ్రెస్​కు ప్రజలు బుద్ధిచెప్తున్నారు 
  • ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ లాంటి వాళ్లే ఓడిపోయారు
  • కేసీఆర్ కూడా కామారెడ్డిలో దురదృష్టవశాత్తూ ఓడారని కామెంట్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో తాము మంచి ఫలితాలనే సాధించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఫలితాలపై శుక్రవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియాతో మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్షంగా ఎన్నికల్లో తాము సఫలమయ్యామని భావిస్తున్నామన్నారు. అధికార పార్టీ 80 నుంచి 90‌‌ శాతం గెలిస్తేనే గెలిచినట్టని, లేకపోతే అది గెలుపెలా అవుతుందని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. ఇప్పటికే 40 శాతం పంచాయతీలను బీఆర్ఎస్​కు ప్రజలు ఇచ్చారని, 4 వేలకుపైగా గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారన్నారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. తాజా ఎన్నికల్లో బీఆర్ఎస్15 మున్సిపాలిటీలను గెలుస్తోందన్నారు. రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీల్లో ఇన్ని మున్సిపాలిటీలను గెలిచామంటే మంచి ఫలితాలేనని చెప్పారు. దేశంలో ఇందిరా గాంధీ, ఎన్టీఆర్ వంటి వాళ్లూ ఓడిపోయారని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కూడా దురదృష్టవశాత్తూ కామారెడ్డిలో ఓడిపోయారని చెప్పారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. 

కొత్తగూడెంలో సీపీఐకి ఆఫర్ ఇచ్చిన

కొత్తగూడెం కార్పొరేషన్​లో హంగ్ వచ్చిందని, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో తాను మాట్లాడి ఓపెన్ ఆఫర్ ఇచ్చానని కేటీఆర్ తెలిపారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలంటే డెఫినెట్​గా కలిసివస్తామని చెప్పానన్నారు. కాంగ్రెస్, బీజేపీలను అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. సింగరేణిలో దోపిడీని అడ్డుకునేలా.. కాంగ్రెస్, బీజేపీని ఎండగట్టాలనే ఉద్దేశంతోనే సీపీఐకి ఈ ఆఫర్​ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు జరిగితే 30 హంగ్ ఏర్పడ్డాయని, 15 తాము గెలిచామని, కాంగ్రెస్ గెలిచింది 46 మాత్రమేనని చెప్పారు. హంగ్ వచ్చిన చోట ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది కేసీఆర్​తో మాట్లాడి ముందుకుపోతామని చెప్పారు. స్థానిక నాయకుల అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుంటామన్నారు.