భారత స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు శుభవార్త. యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ అనిశ్చితి మధ్య కుదేలైన మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో లిస్టయిన అన్ని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ తిరిగి 5 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుంది. ఫిబ్రవరి 27న యుద్ధం స్టార్ట్ కావటానికి ముందు ఉన్న స్థాయికి ఇన్వెస్టర్ల సంపద తిరిగి చేరడం ఊరటను ఇస్తున్న అంశం. మార్కెట్ కరెక్షన్ సమయంలో ఈ సంపద 4.37 ట్రిలియన్ డాలర్లకు పడిపోగా.. ఏప్రిల్‌లో వచ్చిన భారీ ర్యాలీతో కేవలం కొద్ది రోజుల్లోనే 600 బిలియన్ డాలర్ల సంపద మళ్లీ వెనక్కి వచ్చింది. అంటే మన కరెన్సీలో దిని విలువ దాదాపు రూ.54 లక్షల కోట్లు.
మార్కెట్ ఇండెక్స్‌లు సెన్సెక్స్, నిఫ్టీలు ఇంకా యుద్ధం ముందున్న గరిష్ట స్థాయిల కంటే వరుసగా 3,900 పాయింట్లు, 1,100 పాయింట్ల వెనుకంజలోనే ఉన్నప్పటికీ.. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు దుమ్మురేపడంతో మొత్తం మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. ఏప్రిల్‌లో నిఫ్టీ, సెన్సెక్స్ 6.5 శాతం వృద్ధిని నమోదు చేయగా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఏకంగా 12.9 శాతం మేర ఎగబాకింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్-అమెరికా మధ్య శాశ్వత కాల్పుల విరమణపై సానుకూలత వ్యక్తం చేయడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని నింపింది. ఇదే సమయంలో క్రూడ్ ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల సమీపంలో ఉండటం భారత ఇన్వెస్టర్లను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ యుద్ధ సమయంలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు సుమారు 14 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పటికీ.. మన దేశీయ ఇన్వెస్టర్లు ఆ అమ్మకాలను సమర్థవంతంగా అడ్డుకున్నారు. విదేశీయులు అమ్మిన ప్రతి షేరును దేశీయ సంస్థలు కొనుగోలు చేస్తూ మార్కెట్‌కు వెన్నుముకగా నిలిచాయి. మరోవైపు.. సౌత్ కొరియా, జపాన్ వంటి టెక్నాలజీ ఆధారిత మార్కెట్లు AI జోరుతో దూసుకుపోతుండటంతో.. విదేశీ బ్రోకరేజ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ వంటివి ప్రస్తుతం భారత్ కంటే ఆ దేశాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయినప్పటికీ.. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ మూలధన వ్యయం పెరగడం వల్ల మన మార్కెట్లకు దీర్ఘకాలంలో డోకా లేదని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం షేర్ల విలువలు కూడా ఆకర్షణీయంగా మారాయి. నిఫ్టీ ధర-ఆదాయ నిష్పత్తి దీర్ఘకాలిక సగటు కంటే 15 శాతం తక్కువగా ఉంది. ఇది కొత్త ఇన్వెస్టర్లకు మంచి కొనుగోలు అవకాశం కల్పిస్తోంది. ఇకపై కంపెనీల ఆదాయాలు ఏటా 16 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా. ఒకవేళ యుద్ధం పూర్తిగా ముగిసి, ముడిచమురు ధరలు తగ్గితే ఇండియన్ మార్కెట్లు సరికొత్త శిఖరాలను తాకడం ఖాయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. యుద్ధం ముగియకపోయినా.. భారతీయుల సంపద మళ్లీ పూర్వస్థితికి రావడం మన ఆర్థిక పటిష్టతకు నిదర్శనం అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

