భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ 2026 ఆసక్తికరమైన మలుపు తీసుకోబోతోంది. నిర్మలా సీతారామన్ ఈసారి ఒకట్రెండు కాదు.. ఏకంగా దశాబ్దాలుగా వస్తున్న ఆచారాలను పక్కనపెట్టి సరికొత్త శైలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా 75 ఏళ్లుగా కొనసాగుతున్న ఒక సంప్రదాయానికి ఆమె స్వస్తి పలకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది.
సాధారణంగా బడ్జెట్ ప్రసంగం రెండు భాగాలుగా ఉంటుంది Part A, Part B. గత ఏడున్నర దశాబ్దాలుగా.. బడ్జెట్‌లోని ప్రధానాంశాలు, స్కీమ్స్ Part Aలో.. పన్నులు, ఇతర పాలసీ ప్రకటనలు Part Bలో ఉండేవి. కానీ ఈసారి నిర్మలమ్మ తన ప్రసంగంలో Part Bని అత్యంత కీలకంగా మార్చబోతున్నారు. భారత ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను, ప్రాధాన్యతలను ఈ Part Bలోనే ప్రవేశపెట్టనున్నారు. అంటే కేవలం పన్నుల మార్పులే కాకుండా దేశ ఆర్థిక ముసాయిదా మొత్తం ఈ భాగంలోనే ప్రతిబింబించనుంది.
నిర్మలా సీతారామన్ తన 9వ బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ఇప్పటికే పలు మార్పులు చేశారు. గతంలో బ్రిటీష్ కాలం నాటి లెదర్ బ్రీఫ్‌కేస్‌ను వాడే ఆచారాన్ని చెరిపేసి, భారతీయ సంప్రదాయం ప్రకారం ఎర్రటి వస్త్రంలో చుట్టిన 'బహీ ఖాతా'ను తీసుకొచ్చి ఆమె తన మార్కును చాటుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ ప్రసంగ శైలిలో కూడా మార్పులు చేయడం ద్వారా బడ్జెట్ రూపకల్పనలో కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నారు.
ఈ ఏడాది ప్రభుత్వం సుమారు రూ.11 లక్షల 20వేల కోట్ల క్యాపెక్స్ అంచనా వేస్తోంది. ఏఐ, ఆటోమొబైల్, డిఫెన్స్, రైల్వే, రెన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాలకు పెద్దపీట వేయబోతున్నారు. ముఖ్యంగా 'G RAM G'తో పాటు.. హెల్త్, ఎడ్యుకేషన్, టెక్ రంగాలకు భారీ కేటాయింపులు ఉండనున్నాయి. వ్యవసాయం, పర్యాటక రంగాలకు కూడా కేంద్రం నుంచి భారీ ప్రోత్సాహం లభించనుందని అంచనా. అలాగే దేశ ఆర్థిక వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపై ఈ బడ్జెట్ స్పష్టమైన దిశానిర్దేశం చేయనుంది. పన్ను చెల్లింపుదారులే కాకుండా సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను ఈ బడ్జెట్ ఎలా ప్రభావితం చేస్తుందో అని యావత్ భారతం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
