సీఏఏపై వెనక్కి తగ్గం

సీఏఏపై వెనక్కి తగ్గం

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సిటిజన్ షిప్ సవరణ చట్టం(సీఏఏ)పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీసీఏకి వ్యతిరేకంగా అల్లర్లకు పాల్పడుతూ దేశంలో భయానక వాతావరణం సృష్టిస్తున్న వారిని వదిలేది లేదన్నారు. సీఏఏ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తగలబెడుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడం లేదని, దీన్ని బట్టి ఈ అల్లర్ల వెనక కాంగ్రెస్ ఉందనేది అర్థం అవుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టే వారిపై కేసులు పెట్టి, వారి ఆస్తులను జప్తు చేసి కటకటాలకు పంపిస్తామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర శాఖ సీఏఏపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రజా ప్రదర్శన సభ నిర్వహించింది. ఈ సభలో కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ రాష్ట్ర ఇన్​చార్జ్ కృష్ణదాస్ తదితరులు పాల్గొన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసినా, భయపెట్టినా సీఏఏను ఆపేది లేదని, దేశంలో ఏ ఒక్కరికీ దీని వల్ల నష్టం లేదని కిషన్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లీస్ కలిసి ప్రజల్ని రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు. సీఏఏలో ముస్లింలకు వ్యతిరేకంగా ఒక్క పదం కూడా లేదన్నారు. చొరబాటుదారులు, శరణార్థులు వేరువేరని, శరణార్థులను రక్షిస్తామని చెప్పారు. సీఏఏపై ప్రజలకు వాస్తవాలను చెపుతామని, తప్పుడు ప్రచారం చేసే పార్టీలను తిప్పికొట్టాలని ప్రజలకు కిషన్​రెడ్డి పిలుపునిచ్చారు.

తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: లక్ష్మణ్

సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు సీఏఏకు మతం రంగు పులుముతున్నాయని ఆరోపించారు. సీఏఏలో ముస్లిం అనే పదం లేదని మజ్లీస్ పార్టీ, సీఎం కేసీఆర్, కేటీఆర్ గగ్గోలు పెడుతున్నారని, ముస్లింల పౌరసత్వం పోతుందనే ప్రచారాన్ని సాగిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోని ముస్లింలందరూ ఇక్కడి పౌరులుగానే ఉంటారన్నారు. సీఏఏను తప్పుబడుతున్న సీఎం కేసీఆర్.. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం తీసుకుని, దాన్ని రాజకీయ అవసరాలకు వాడుకోవడం లేదా? అని ప్రశ్నించారు.
కేంద్రం జనాభా వివరాలను తీసుకుంటే తప్పుపట్టడం ఏమిటన్నారు. పాక్, బంగ్లాదేశ్ లో భారతీయులపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయని, సీఏఏను వ్యతిరేకించే నేతలు ఏనాడైనా విదేశాల్లో భారతీయులపై జరుగుతున్న హింసలపై మాట్లాడారా? అని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను అక్కున చేర్చుకునేందుకు ప్రధాని మోడీ సీఏఏను అమలు చేయాలని నిర్ణయించారని చెప్పారు. సీఏఏపై మజ్లిస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్సీ రాంచందర్ రావు మండిపడ్డారు. ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, జనం పాల్గొన్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సి ఉండగా ఆయన రాలేకపోయారు.