రాష్ట్రంలో రోజుకు 127 మందికి క్యాన్సర్

రాష్ట్రంలో రోజుకు 127 మందికి క్యాన్సర్
  • పోయినేడు 46,464 మందికి సోకిన జబ్బు
  • నోటి, బ్రెస్ట్, సర్వైకల్ కేన్సర్ బాధితులే అధికం
  • ఆదిలాబాద్​, రంగారెడ్డిలో ఎక్కువ కేసులు

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో కేన్సర్‌ బాధితుల సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఐసీఎంఆర్‌‌ ఆధ్వర్యంలోని నేషనల్ కేన్సర్‌‌ రిజిస్ర్టీ ప్రోగ్రామ్‌(ఎన్‌సీఆర్పీ) అంచనా ప్రకారం మన రాష్ట్రంలో ప్రతిరోజు 127 మంది కేన్సర్‌ బారినపడుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2016 నుంచి 2019 వరకు ఏకంగా 1,79,158 మంది కేన్సర్‌‌ బారినపడ్డట్టు పార్లమెంట్‌లో ప్రకటించింది. 2016లో 43,129 మందికి కేన్సర్‌‌వస్తే, 2019లో 46,464 మందికి సోకింది. వీరిలో ఎక్కువగా నోటి, బ్రెస్ట్‌, సర్వైకల్ కేన్సర్ బాధితులే ఉన్నారు. పోయినేడు 13,130 మంది కామన్ కేన్సర్‌ (ఓరల్, సర్వైకల్, బ్రెస్ట్ కేన్సర్లు) బాధితులను గుర్తించారు. హాస్పిటళ్లకు రానివారి సంఖ్య కూడా కలిపితే బాధితుల సంఖ్య 20 వేలకు పైగానే ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మొత్తంగా రాష్ట్రంలో సుమారు లక్ష మంది కేన్సర్ పేషెంట్లు ఉంటారని అంచనా. ఏటా కొత్తగా 45వేల మంది కేన్సర్ బారిన పడుతుండగా, 17వేల నుంచి 20వేల మంది చనిపోతున్నారు.

గుట్కా, పాన్ మసాలాతోనే..

రాష్ట్రంలో ఓరల్ కేన్సర్ కేసులు అధికంగా ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో బ్రెస్ట్, సర్వైకల్, లంగ్స్, బ్లడ్ కేన్సర్ కేసులు ఉంటున్నాయి. గుట్కా, పాన్‌‌ మసాలా వంటి అలవాట్లు ఉండడంతోనే రాష్ర్టంలో ఓరల్ కేన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి 10 మంది ఓరల్ కేన్సర్‌‌‌‌బాధితుల్లో 8 మంది గుట్కా, పాన్ తినే వారే ఉంటున్నారని ఎంఎన్‌‌జే కేన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ జయలలిత చెప్పారు. రాష్ర్టంలో రంగారెడ్డి, ఆదిలాబాద్‌‌ జిల్లాల్లో ఎక్కువ మంది కేన్సర్ బారిన పడుతున్నట్టు తాము గుర్తించామని తెలిపారు. ఆదివాసీల్లో కేన్సర్‌‌‌‌ ముప్పు 20శాతం ఎక్కువగా ఉందని వెల్లడించారు. దీనికి మహిళలకు లేట్ వయసులో పెళ్లిళ్లు కావడం, పిల్లల్ని కనకపోవడం, రేడియేషన్ ఎఫెక్ట్‌‌, జన్యు లోపాలు  ఉన్నాయని వివరించారు. పొల్యూషన్, శారీరక శ్రమ లేకపోవడం, మారిన ఆహారపు అలవాట్లు ఇతర కేన్సర్లకు కారణమవుతున్నాయని చెప్పారు.

లేట్ గా గుర్తిస్తున్నరు

కేన్సర్‌‌‌‌ బాధితుల్లో చాలా మందికి ఆ వ్యాధి ముదిరే వరకూ జబ్బున్న విషయం తెలియడం లేదు. ముందు మందులను వాడి, చివరకు హాస్పిటళ్లకు వస్తున్నారు. అప్పటికే రోగం మూడో స్టేజ్‌‌లోనో, నాలుగో స్టేజ్‌‌లోనో ఉంటోంది. అందువల్లే కేన్సర్‌‌‌‌ డెత్ రేట్ ఎక్కువగా ఉంటోందని.. ఫస్ట్, సెకండ్ స్టేజ్‌‌లోనే గుర్తిస్తే పూర్తి స్థాయిలో రికవరీ అవుతారని డాక్టర్ జయలలిత చెప్పారు. పీహెచ్‌‌సీ, ఏరియా, జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లకు ఎర్లీ స్టేజ్‌‌లోనే కేన్సర్లను గుర్తించడంపై పెద్దగా అవగాహన ఉండడం లేదని హెల్త్ ఎక్స్ పర్టులు చెబుతున్నారు.

దవాఖాన్లు కూడా లేవు

ప్రస్తుతం మన దగ్గర ఆంకాలజీ సేవలు హైదరాబాద్‌‌కే పరిమితమయ్యాయి. వరంగల్‌‌లో తప్ప జిల్లాల్లో ఎక్కడా కేన్సర్ స్పెషలిస్టులు గానీ, కేన్సర్‌‌‌‌ డిటెక్షన్ సెంటర్లు గానీ గవర్నమెంట్ హాస్పిటళ్లలో లేవు.  అందేరూ హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని దవాఖాన్లలో కేన్సర్‌‌‌‌క్లినిక్‌‌లు పెట్టాలని నిర్ణయించారు. ఈ సెంటర్ల నిర్వహణకు నేషనల్ హెల్త్ మిషన్‌‌ కింద కేంద్రం నిధులూ ఇచ్చింది. కేన్సర్ లక్షణాలను గుర్తించడం, కేన్సర్ రోగులకు సేవలు అందించడంపై ఆయా జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు క్లినిక్‌‌లను ప్రారంభించలేదు. కరోనా కారణంగానే ఆలస్యమవుతోందని, త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉందని డాక్టర్ జయలలిత తెలిపారు. రీజనల్ కేన్సర్ సెంటర్ల ఏర్పాటుకు కూడా కేంద్ర ఆరోగ్యశాఖకు ప్రతిపాదనలు పంపించామని ఆమె వెల్లడించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే కేన్సర్ స్ర్కీనింగ్‌‌ పెరిగి, ఎర్లీ స్టేజ్‌‌లో గుర్తించేందుకు అవకాశం ఉంటుందన్నారు.